ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. గతంలో కేరళ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ ధాఖలు చేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఉద్యోగుల పెన్షన్ కొన్ని వందల శాతం పెరగనుంది.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి ఆఖరి పూర్తి వేతనం ఆధారంగా పెన్షన్ అందించాలని కేరళ హై కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. గరిష్ట పరిమితి రూ.15వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు.. EPSకు అర్హులు కాదంటూ ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్‌లో 2014లో సవరణల్ని చేసింది EPFO. ఈ సవరణల్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు.. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. 2018లో ఈపీఎఫ్ఓ సవరణల్ని రద్దు చేసింది కేరళ హైకోర్టు.
రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగి చివరి వేతనాన్ని పరిగణలోకి తీసుకుని పెన్షన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ EPFO దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో కేరళ హైకోర్టు తీర్పు అమలులోకి రానుంది. సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఉద్యోగుల పెన్షన్ కొన్ని వందల శాతం పెరగనుంది. అదేసమయంలో ప్రావిడెంట్ ఫండ్ వాటా తగ్గొచ్చు. అదనపు కంట్రిబ్యూషన్ అనేది PFకు కాకుండా EPSకు వెళ్తుంది. పెన్షన్ అధిక మొత్తంలో వస్తుండటంతో దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఈపీఎస్‌ను ఇలా లెక్కిస్తారు..
కేంద్ర ప్రబుత్వం 1995లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో కంపెనీ ఉద్యోగి వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ స్కీమ్‌లో జమచేయాలి. అయితే ఈ కంట్రిబ్యూషన్ రూ. 6వేల 500లో 8.33 శాతానికి మాత్రమే పరిమితం. అంటే ఈపీఎస్ అకౌంట్‌కు నెలకు గరిష్టంగా రూ.541 జమ అవుతాయి. 1996 మార్చిలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. 2014లో సెప్టెంబర్ 1న మరోసారి ఈ నిబంధనలను సవరించింది. గరిష్టంగా రూ.15వేల ప్రాతిపదికన 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు జమ చేసుకోవచ్చని మార్పులు చేసింది. దీన్నిబట్టి నెలకు గరిష్టంగా రూ.1,250లు ఈపీఎస్ ఖాతాలో జమ అవుతోంది.
అయితే ఇక్కడ ఈపీఎఫ్‌వో ఒక తిరకాసు పెట్టింది. పూర్తి వేతనంపై పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే ఐదేళ్ల వేతనం సగటు ప్రాతిపదికన పెన్షన్ ఉంటుందని తెలిపింది. అంతే తప్ప గత ఏడాది వేతన సగటును ప్రాతిపదికన తీసుకోమని స్పష్టం చేసింది. దీంతో కేరళలో ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. వారి ప్రయత్నం ఫలించి 2014 సెప్టెంబర్ ఒకటిన ఈఫీఎఫ్ ఓ మార్పులను పక్కన పెట్టింది. పాత విధానాన్నే అనుసరించాలని ఆదేశించింది. ఈపీఎస్‌లో జమ అయ్యే విధానం ఉద్యోగుల వేతనంలో 12 శాతం మొత్తం ఈపీఎఫ్‌కి జమ అవుతుంది. కంపెనీలు కూడా 12 శాతం మొత్తాన్ని జమచేస్తాయి. ఇందులో 3.67 శాతం ఈపీఎఫ్ కు వెళుతుంది. మిగతా 8.33 శాతం ఈపీఎస్‌కు జమ అవుతుంది. పీఎఫ్ ఖాతాలో రెండు విభాగాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒకటి ఈపీఎఫ్. రెండోది ఈపీఎస్.
రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ ఉద్యోగుల కొత్త పెన్షన్ ఇలా ఉంటుంది
సర్వీసు | చివరి జీతం | ప్రస్తుత పెన్షన్ | కొత్త పెన్షన్ |
33 | రూ. 50 వేలు | రూ. 5 వేల 180 | రూ. 25 వేలు |
30 | రూ. 50 వేలు | రూ. 4 వేల525 | రూ. 22 వేల 857 |
25 | రూ. 50 వేలు | రూ. 3 వేల 425 | రూ. 19 వేల 225 |
20 | రూ. 50 వేలు | రూ. 2 వేల 100 | రూ. 14 వేల 285 |
33 | రూ. లక్ష | రూ. 5 వేల 180 | రూ. 50 వేలు |
30 | రూ. లక్ష | రూ. 5 వేల 180 | రూ. 45 వేల714 |
25 | రూ. లక్ష | రూ. 3 వేల 425 | రూ. 38 వేల 517 |
20 | రూ. లక్ష | రూ. 2 వేల 100 | రూ. 28 వేల 571 |