Piyushgoyal On Goods Exports
PiyushGoyal On Goods Exports : భారత్.. ఆత్మ నిర్భర్ దిశగా దూసుకెళుతోందని కేంద్ర వాణిజ్య ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మార్చి నెలలో 40 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని ఆయన తెలిపారు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత దేశ రైతాంగం దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిందన్నారు. థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం కలెక్షన్స్ కురిపిస్తోందన్న కేంద్రమంత్రి.. అలాగే భారత ఆర్ధిక వ్యవస్థ రికార్డులు బద్దలు కొడుతోందన్నారు. అందరూ కలిసి పని చేస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదన్నారు.
దేశ ఎగుమతిదారులు, రైతులు, ఎంఎస్ఎంఈలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కేంద్రమంత్రి ధన్యవాదాలు తెలిపారు. దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయన్నారు. 2019-20 లో 2 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి (5 కోట్లు) అయ్యాయని తెలిపారు. 2020-21 లో 21 లక్షల టన్నులకి పైగా గోధుమలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయని వెల్లడించారు. టెక్స్ టైల్ ఎగుమతులు భారీగా పెరిగాయన్నారు. ఆస్ట్రేలియా, యూఏఈతో లేబర్ ఓరియంటెడ్ పథకాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్టు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టీమిండియా స్పిరిట్ ను కోవిడ్ మహమ్మారి కూడా ఆపలేకపోయిందన్నారు.
లోకల్ వస్తువులు ప్రపంచ వ్యాప్త మవుతున్నాయని చెప్పారు. మేడిన్ ఇండియా వస్తువులు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయని తెలిపారు. ఎగుమతుల్లో భారత్.. ఉన్నత శిఖరాలకు వెళుతుందన్నారు. ఎటువంటి సబ్సిడీలు గ్రాంట్లు లేకుండానే ఎగుమతుల్లో రికార్డులు సాధించామని, అదే పద్దతిలో ముందుకు సాగాలని కేంద్రమంత్రి అన్నారు. ఒక స్థాయి వరకు మాత్రమే సహకారం, మద్దతు ఇవ్వగలం అని, అంతకు మించి ఇవ్వడం ఏ దేశానికీ సాధ్యం కాదని పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. అంతిమంగా మన కాళ్లపై మనమే నిలబడాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు, పోటీ తత్వం కారణంగా ఎగుమతుల్లో భారత్ అగ్ర స్థానంలో ఉందన్నారు. ఇదే పద్దతిలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం అన్నారు.
Piyush Goyal On Rice : ఒక స్థాయి వరకే సహకారం ఇవ్వగలం-పీయూష్ గోయల్
ఎగుమతుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం అనుకుంటున్నాం అని చెప్పారు. ఈసారి గోధుమ ఎగుమతులు భారీగా పెంచుతామన్న కేంద్రమంత్రి.. 10 మిలియన్ టన్నుల గోధుమలు ఎగుమతి చేస్తామన్నారు. రైతులు కూడా గోధుమ ఉత్పత్తి పెంచారని.. గుజరాత్ నుంచే కాకుండా మధ్యప్రదేశ్, యూపీ నుంచి కూడా గోధుమ ఎగుమతులు జరుగుతున్నాయన్నారు.
”2020-21లో గోధుమలు, బియ్యం కలిపి 48.59 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. గతేడాది కన్నా 20 శాతం ఎగుమతులు పెరిగాయి. శ్రీలంకకు భారీగా ఆహార ధాన్యాలు ఎగుమతి అవుతున్నాయి. రేపు కాకినాడ నుంచి శ్రీలంకకు బియ్యం పంపిస్తున్నాం. లైన్ ఆఫ్ క్రెడిట్ తో శ్రీలంక బియ్యం కొనుగోలు చేస్తుంది” అని వాణిజ్య శాఖ కార్యదర్శి తెలిపారు.