Gorakh
Gorakhnath temple attack: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో జరిగిన దాడిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీ సోషల్ మీడియా ద్వారా ఐసిస్ తీవ్రవాదులు మరియు సానుభూతిపరులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. యూపీ స్టేట్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీకి చెందిన జీమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్, ఈ-వాలెట్స్ వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, వివిధ సోషల్ మీడియా ఖాతాల డేటాను విశ్లేషించామని తెలిపారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అబ్బాసీ ఏప్రిల్ 3న ప్రసిద్ధ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆసమయంలో ఆలయంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై కొడవలితో దాడి చేసి ఇద్దరు సాయుధులైన సిబ్బందిని గాయపరిచాడు. వెంటనే అప్రమత్తమైన ఇతర భద్రతా సిబ్బంది అహ్మద్ ముర్తజా అబ్బాసీని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఐసిస్ ప్రచార కర్త మెహదీ మస్రూర్ బిశ్వాస్ సంబంధం ఉన్నందన్న కారణంతో అహ్మద్ ముర్తజా అబ్బాసీని 2014లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలు, ఐసిస్ తీవ్రవాదుల బోధనల ద్వారా అబ్బాసీ ప్రభావితం అయ్యాడని ఏడీజీ తెలిపారు. యూరప్, అమెరికాలోని వివిధ దేశాల్లోని ఐసిస్ మద్దతుదారులకు సంబంధించిన సంస్థల ద్వారా ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు పలుకుతూ అబ్బాసీ తన బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు రూ. 8.5 లక్షలను పంపించినట్లు పోలీసులు గుర్తించారు. గోరఖ్ నాథ్ ఆలయం దక్షిణ ద్వారం వద్ద అహ్మద్ ముర్తజా అబ్బాసీ ఒక్కసారిగా కలకలం సృష్టించి విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించాడని, అనంతరం ఆలయంలో కాల్పులు జరపాలనే అబ్బాసీ ఉద్దేశమని ఏడీజీ తెలిపారు.
Also read:Covid Vaccine wastage: చెత్తకుప్పలో కరోనా టీకాలు: విచారణకు ఆదేశించిన అధికారులు
కాగా ఈ దాడికి సంబంధించి ఏప్రిల్ 25న ప్రత్యేక కోర్టు అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి ఏడు రోజుల కస్టడీని విధించింది. అతని కస్టడీ కాలం మే ౩ న ముగుస్తుంది. ముర్తజా అబ్బాసీని గోరఖ్ పూర్ జైలు నుంచి తీసుకువచ్చిన తర్వాత ఇన్ ఛార్జి ఏటీఎస్ జడ్జి మహ్మద్ గజలీ ఎదుట హాజరుపరిచారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోరఖ్ నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు తరచుగా ఈ ఆలయాన్ని సందర్శించి అక్కడే బస చేస్తారు.
Also read: Manickam Tagore On Rahul Tour : రాహుల్ రాకతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది-మాణిక్కం ఠాగూర్