ఎస్పీ-బీఎస్పీ షాక్ : బీజేపీలోకి గోరఖ్ పూర్ ఎంపీ

లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీకి ఊహించని షాక్ తగిలింది.గోరఖ్ పూర్ లోక్ సభ  స్థానానికి సీఎం అయిన తర్వాత యోగి ఆదిత్యనాధ్ రాజీనామా చేయడంతో గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రవీణ్ కుమార్ నిషాద్ గురువారం(ఏప్రిల్-4,2019)బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

 గతేడాది జరిగిన గోరఖ్ పూర్ ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. ఆ స్థానం నుంచి గెలిచిన ప్రవీణ్ నిషాద్ ఇప్పుడు బీజేపీలో చేరడం విశేషం. నిషాద్ పార్టీకి చెందిన ప్రవీణ్ నిషాద్ ఆ ఎన్నికల్లో ఎస్పీ టికెట్ తరఫున పోటీ చేశారు. బీఎస్పీ మద్దతు కూడా ఉండటంతో 26 వేల మెజార్టీతో గెలిచారు. అయితే ఈసారి కూడా ఎస్పీ గుర్తుపైనే పోటీ చేయాలని అఖిలేష్ చెప్పగా.. తాను మాత్రం నిషాద్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ప్రవీణ్ పట్టుబట్టారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు గోరఖ్‌పూర్ నుంచి ఆయనకే బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రవీణ్ బీజేపీలో చేరినా, ఆయన నిషాద్ పార్టీ కొనసాగనుంది.ప్రవీణ్ నిషాద్ తండ్రి సంజయ్ నిషాద్ ఆ పార్టీని నడిపించనున్నారు.బీజేపీకి నిషద్ పార్టీ మద్దతివ్వనుంది.