New Office Timings (Photo : Google)
New Office Timings : ఇకపై అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 7.30 గంటలకే ఓపెన్ అవుతాయి. మధ్యాహ్నం 2గంటల వరకే పని చేస్తాయి. ఆ తర్వాత అన్ని ఆఫీసులు క్లోజ్ అవుతాయి. ఈ మేరకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త రూల్ మే 2వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. పంజాబ్ రాష్ట్రంలో.
అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉక్కపోతతో జనం విలవిలలాడిపోతున్నారు. చల్లదనం కోసం పాట్లు పడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పెరిగింది. రూమ్ లో కనీసం ఫ్యాన్ లేనిదే ఉండలేని పరిస్థితి. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది.
Also Read..AIADMK: గొడవలు సద్దుమణిగాయి.. కేంద్ర మంత్రివర్గంలోకి అన్నాడీఎంకే!
ఇది ఏదో ఒక రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కాదు. దాదాపు అన్ని చోట్లా ఇదే సీన్. పంజాబ్ రాష్ట్రంలోనూ ఎండాకాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. దీంతో విద్యుత్ డిమాండ్ ను తగ్గించేందుకు, పవర్ ని సేవ్ చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేశారు.
ఇకపై ఆ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 7.30 గంటలకే తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 2 గంటల వరకే పని చేస్తాయి. ఈ కొత్త టైమింగ్స్ మే 2నుంచి అమల్లోకి వస్తాయి. తాను కూడా సీఎంవోకు ఉదయమే చేరుకుంటానని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. మే 2న మొదలై జూలై 15వ తేదీ వరకు ఇవే టైమింగ్స్ కొనసాగుతాయన్నారు.
పంజాబ్ లో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు.. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉన్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ ఆఫీసుల పనివేళల్లో మార్పు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మార్పు చేసిన పనివేళలు మే 2 నుంచి అమల్లోకి వస్తాయని, జూలై 15వ తేదీ వరకు అమల్లో ఉంటాయన్నారు. ఈ నిర్ణయంతో రెండు ప్రధాన ప్రయోజనలు కలుగుతాయన్నారు. ఒకటి విద్యుత్ ను ఆదా చేయడం, రెండవది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఎండాకాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులు సులువుగా చేసుకునేందుకు సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. మండుటెండుల్లో బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉందన్నారు. పని వేళలు మార్చవడం వల్ల ప్రజలు ఉదయాన్నే ఆఫీసులకు వచ్చి తమ పనులను పూర్తి చేసుకోవచ్చన్నారు. అధికారులతో సంప్రదింపుల తర్వాతే అందరి సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భగవంత్ మాన్ చెప్పారు.
ఆఫీసు పనివేళల్లో మార్పు చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉందన్నారు ముఖ్యమంత్రి మాన్. సామాన్య ప్రజలు తన పని నుండి సెలవు తీసుకోకుండా ఉదయాన్నే కార్యాలయాలకు వచ్చి తన పనిని చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. అదేవిధంగా, ఉద్యోగులు కార్యాలయ సమయం తర్వాత సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా, ఉద్యోగులు కూడా త్వరగా ఇంటికి వెళ్లి తమ పిల్లలు, కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడపగలుగుతారని భగవంత్ మాన్ అన్నారు.
అంతేకాదు.. ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో గణనీయమైన విద్యుత్ వినియోగం తగ్గుతుందన్నారు. దాదాపు 300-350 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేయడంలో ఈ నిర్ణయం సహాయపడుతుందని చెప్పారు.
ఇక ఆఫీసు పని సమయాల్లో మార్పు నిర్ణయం.. అత్యధికంగా సూర్యరశ్మిని వినియోగించేలా చూస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అనేక దేశాల్లో ప్రజలు తమ గడియారాలను సీజన్‌కు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటారని, తద్వారా వారు గరిష్ట సూర్యరశ్మిని ఉపయోగించవచ్చని ఆయన ఉదహరించారు. రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మరిన్ని పౌర కేంద్రీకృత నిర్ణయాలు తీసుకుంటుందని భగవంత్ మాన్ ప్రజలకు హామీ ఇచ్చారు.