గవర్నమెంట్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్… చూసి ఇంగ్లీష్ చదవడం రాదు

గవర్నమెంట్ స్కూల్ లో రోజూ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పే టీచర్ కి ఇంగ్లీష్ చదడమే రాదని తెలిసి దేశం షాక్ అయింది. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో వెలుగుచూసిన ఈ ఘటనతో దేశ ప్రజలు అవాక్కయ్యారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లాలోని సికిందర్ పుర్ సరౌసీలోని ప్రభుత్వ పాఠశాలలో రాజ కుమారి అనే మహిళ ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో స్వయంగా తెలుసుకునేందుకు ఇతర అధికారులతో కలిసి నవంబర్ 28,2019న జిల్లా మెజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ పాండే స్కూల్ లో ఆకశ్మిక తనిఖీ నిర్వహించారు.

తనిఖీ సమయంలో స్కూల్ లోని ఇంగ్లీష్ టీచర్ రాజకుమారిని 8వ తరగతి టెక్స్ట్ బుక్ చదవాలని చెప్పాడు జిల్లా మెజిస్ట్రేట్. అయితే ఆ బుక్ చదవడానికి ఆమె చాలానే కష్టపడింది. కనీసం టెక్స్ట్ బుక్ కూడా చదవడం రాని ఆమెను చూసి దేవేంద్ర కుమార్ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానం ఇలాగే ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. మన విద్యావిధానం అద్భుతం అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.