కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల కోసం తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో.. ఇండియా గేట్ వీధుల్లో.. పార్లమెంట్ దారుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తోండగా.. దీక్షల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రైతు దీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో గెటా థెన్‌బర్గ్ చేసిన టూల్‌కిట్ వివాదంలో బెంగళూరుకు చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు.
బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త 22ఏళ్ల దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్‌లోడ్ చేశారు. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు థన్‌బర్గ్‌పై అలాగే దిశపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. ఈక్రమంలోనే దిశను అరెస్ట్ చేశారు.
‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ పేరిట పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారిలో దిశ రవి ఒకరు కాగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం, ప్రభుత్వంపై కుట్రకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగానే తాజాగా దిశ రవిని అరెస్ట్ చేశారు.
విచారణ సమయంలో దిశ కన్నీరు పెట్టుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్ చేశానని ఆమె వెల్లడించారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరినట్లు కూడా చెప్పుకొచ్చారు. అనంతరం దిశను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు.
జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టూల్‌కిట్ రూపకర్తల సమాచారం అందించాలంటూ గూగుల్, ట్విట్టర్‌లను కోరారు. ఆ రెండు సంస్థలు ఇచ్చిన వివరాల మేరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన అలజడులను సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది.