amith shah గుజరాత్లోస్థానిక సంస్థల తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు (అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్) నగర కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. కొవిడ్ నిబంధనల నడుమ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం.
ఉదయం 7 గంటలకు పోలింగ్. ప్రారంభమవగా.. ఒంటి గంట సమయానికి సగటున 19. 61శాతం పోలింగ్ నమోదైంది. కాగా, అహ్మదాబాద్‌లోని నారన్పురలో కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. తన స్వస్థలమైన రాజ్‌కోట్‌లో ఓటు వేయనున్నారు. ఇప్పటివరకు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఓటు వేశారు.
6 నగరాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. మరోవైపు, ఫిబ్రవరి 28న రెండో దశలో.. 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ స్థానిక ఎన్నికలు కీలకం కానున్నాయి.