DUMAS BEACH : అందాల బీచ్‌లో ఆత్మల స్వైర విహారం .. పగలంతా జనం సంచారం..రాత్రైతే దెయ్యాల విహారం..గుండెలు బేజారెత్తించే డేంజరస్ బీచ్

అందాల బీచ్‌లో ఆత్మల స్వైర విహారం..పగలంతా జనం సంచారం..రాత్రైతే దెయ్యాల విహారం..ఎంతటి ధైర్యవంతులకైనా వెన్నులో వణుకు పుట్టించే అత్యంత భయానకమైన బీచ్ అది. ఎవరో మన వెంటే వస్తున్నట్లు..మన చెవిలో గుసగుసలాడుతున్నట్లుగా భయపెడతాయి ఆత్మలు. గుండెలు బేజారెత్తించే డేంజరస్ బీచ్ లో సాయంత్రం అయ్యిదంటే చాలు మనుషులు కాదు కదా కనీసం కుక్కలు కూడా అటువైపుగా వెళ్లవు.

Dngerous DUMAS BEACH

Dngerous DUMAS BEACH : దెయ్యాలున్నాయా….? వాటిని ఎప్పుడైనా చూశారా…? ఇదో పెద్ద యూనివర్శల్‌ డిస్కషన్ టాపిక్‌… ఎన్ని గంటల పాటైనా దానిపై వాదించొచ్చు…ఉన్నాయంటాకు కొందరు..లేవంటారు ఇంకొందరు. ఈ చర్చలకు అంతే ఉండదు. ఉన్నాయా? లేవా? అనేది పక్కన పెడితే అందరికీ దెయ్యం ఓ పెద్ద మిస్టరీ… మన దేశంలో అయితే దెయ్యాలు, నమ్మకాల గురించి చెప్పాల్సిన పనిలేదు. దెయ్యం మనందరికీ ఇష్టమైన ఓ మిస్టరీ…అలాంటి ఓ మిస్టరీ ప్లేస్‌ డుమాస్‌…

దెయ్యాలున్నాయా లేదా అని ఎవరినైనా అడగండి…రకరకాల సమాధానాలు వస్తాయి. ఉన్నాయని కొందరు వాదిస్తే మరికొందరైతే వాటిని చూశామంటారు…ఇంకొందరు ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తుంటారు. అదంతా ఓ భ్రమ అంటారు. ఇదిగో దెయ్యం అంటూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంటాయి. దెయ్యాలపై చర్చ పెడితే నిమిషాలు గంటలు కాదు రోజుల తరబడి చర్చ సాగుతూనే ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే మన దేశంలో కొన్ని మిస్టీరియస్‌ ప్లేస్‌లున్నాయి. వాటిలో ఏదో జరుగుతుంది. కానీ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు… దాని గురించి ప్రచారంలో ఉన్న వాటిని నమ్మలేం… అలాగని వాటిని తోసిపుచ్చలేం… ప్రచారంలో ఉన్న నమ్మకాలు నిజమని నమ్మడానికి ఆధారాలుండవు…. కాదని చెప్పడానికి సాక్ష్యాలుండవు.. అంతా మిస్టరీనే… అలాంటి ఓ మిస్టీరియస్‌ ప్లేసే ఈ డుమాస్‌ బీచ్‌…

డుమాస్‌ బీచ్‌… ఎక్కడో కాదు మన గుజరాత్‌లోనే ఉంది ఇది … డైమండ్‌ సిటీ సూరత్‌ను ఆనుకుని అరేబియన్ సముద్రం వెంబడి ఉంటుంది ఈ బీచ్‌… ఇది ఓ పెద్ద మిస్టీరియస్‌ ప్లేస్‌… ఇంతకీ ఈ బీచ్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా…? దెయ్యాలు… అవును ఉదయం పూట అత్యంత అందంగా కనిపించే అరేబియా సాగర తీరం రాత్రైతే దెయ్యాల దిబ్బగా మారిపోతుంది. పగలు అందమైన ఆడపిల్లలా అలరించే ఈ బీచ్‌ రాత్రైతే బ్రహ్మరాక్షసిలా బెదిరిస్తుంది..

సూరత్‌ను ఆనుకుని ఉన్న ఈ బీచ్‌ ఉదయం వేళల్లో పూర్తి రద్దీగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. సముద్రపు నీటిలో తడుస్తూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. ఓవైపు జనం, మరోవైపు చిరు వ్యాపారులు….అంతా హడావుడి… కానీ సాయంత్రం ఆరు కొట్టిందా అక్కడ్నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటారు. చీకట్లు పూర్తిగా చుట్టుముట్టే వేళకు డుమాస్‌ నుంచి జనమంతా పరార్… చీకట్లు ముసురుకోగానే ఆ ప్రాంతంలో చూద్దామంటే చీమ కూడా కనిపించదు. అక్కడంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఆ నిశ్శబ్దంలోంచే అసలు కథ మొదలవుతుంది. మెల్లిగా కొన్ని వింత శబ్దాలు మొదలవుతాయి. ఎవరికీ అర్థం కాని గుసగుసలు వినిపిస్తుంటాయి. కొంచెం కొంచెంగా వాటి తీవ్రత పెరుగుతుంది. ఆ సమయంలో ఒక్క మనిషి కూడా అక్కడ ఉండడు… కానీ మనుషులు రహస్యంగా మాట్లాడుకుంటున్నట్లు శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాలేంటి అంటే అక్కడి ప్రజలు ముక్తకంఠంతో చెప్పేమాట దెయ్యాల గోల అని. అవును నిజమే అవి దెయ్యాల ఆర్తనాదాలట… చీకటి పడగానే ఈ బీచ్‌కు దెయ్యాలు షికారుకు వస్తుంటాయని స్థానికులు చెబుతారు. అవి మాట్లాడుకునే మాటలే ఆ అర్ధం కాని విచిత్ర శబ్ధాలని స్థానికులంటారు.

ఆ బీచ్‌లో దెయ్యాలు సంచరిస్తుంటాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు. ఈ నమ్మకం ఇప్పటిది కాదు గత కొన్ని శతాబ్దాలుగా వస్తున్న భయం అది. దాన్ని అధిగమించాలని బీచ్‌లోకి ఎవరో ఒకరు అడుగుపెట్టడం… అకారణంగా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిపోతోంది. దీంతో జనంలో ఆ భయం అంతకంతకూ పెరిగిందే తప్ప తగ్గలేదు. చీకటి పడ్డాక డుమాస్‌ బీచ్‌లో అడుగుపెట్టడం సురక్షితం కాదని అక్కడ ఎవరిని అడిగినా చెబుతారు.

కొత్తవారెవరైనా రాత్రి వేళ బీచ్‌లో అడుగు పెడితే వారికి రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ఎవరో వారిని ఫాలో అవుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. వెనక్కుతిరిగి చూస్తే ఎవరూ ఉండరు. కానీ శబ్ధం మాత్రం అనుసరించి వస్తూనే ఉంటుంది. దీంతో హార్ట్‌బీట్‌ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఒళ్లంతా చెమటలు పడతాయి. దీంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఆ బీచ్‌ నుంచి పారిపోతుంటారు. కాస్త గుండె ధైర్యం ఉన్న వారెవరైనా ఇంకాస్త ధైర్యం చేసి మరింత ముందుకెళితే ఆ శబ్దాల తీవ్రత మరింతగా పెరుగుతుంది. చెవి దగ్గర ఎవరో ఏదో మాట్లాడుతున్నట్లు, ఏదో చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఓవైపు గాలి హోరు, మరోవైపు గుసగుసల జోరుతో ఉన్న ఆ కాస్త ధైర్యం కూడా జారిపోతుంది.

మనుషులే కాదు రాత్రివేళల్లో జంతువులు కూడా ఈ ప్రాంతంలో అడుగుపెట్టడానికి సాహసించవు. సాధారణంగా వీధికుక్కలు పర్యాటకులు విసిరేసిన ఆహారం కోసం వస్తుంటాయి. కానీ అవి కూడా రాత్రి పూట డుమాస్‌ బీచ్‌లో అడుగుపెట్టవు. ఎందుకంటే అదో పెద్ద మిస్టరీ. అంతేకాదు రాత్రివేళల్లో బీచ్‌వైపు చూసి ఇవి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. భయంతో అరవడం, దూరంగా పారిపోవడం వంటివి చేస్తుంటాయి. కుక్కలకు దెయ్యాలు కనబడతాయని, కంటికి కనిపించని ఆత్మలను కూడా అవి చూస్తుంటాయని చాలామంది నమ్ముతుంటారు. రాత్రి వేళల్లో బీచ్‌లో తిరిగే దెయ్యాలను చూసే కుక్కలు అరుస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. వారందరికీ ఈ అరుపులు, ఆ వింత శబ్దాలు అలవాటైపోయాయి.