Train stopped for Tea: టీ తాగేందుకు ఎక్స్‌ప్రెస్ రైలును ఆపిన లోకో పైలట్లు: విచారణకు ఆదేశించిన రైల్వేశాఖ

టీ తాగేందుకు ఏకంగా ఎక్స్‌ప్రెస్ రైలునే ఆపారు లోకో పైలట్లు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Train stopped for Tea: నగరాల్లోనూ, హైవే పై వాహనాల్లో ప్రయాణం చేసేటపుడు అలసటగా అనిపిస్తే కాసేపు వాహనాన్ని ఆపి టీ సేవిస్తుంటారు వాహనదారులు. అయితే టీ తాగేందుకు ఏకంగా ఎక్స్‌ప్రెస్ రైలునే ఆపారు లోకో పైలట్లు. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్వాలియర్-బరౌని ఎక్స్ప్రెస్ (11123) లోకో పైలట్లు టీ తాగడానికి బీహార్లోని సివాన్ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ సమీపంలో రైలును నిలిపివేశారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, రైలు ఉదయం 5.27 గంటలకు సివాన్ స్టేషన్ క్రాసింగ్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో అసిస్టెంట్ లోకో పైలట్ రైలు ఇంజిన్లో నుంచి దిగి టీ తీసుకురావడానికి సమీపంలోని ఒక స్టాల్లోకి వెళ్ళాడు. ఆసమయంలో లోకో పైలట్ ఉద్దేశపూర్వకంగానే టీ స్టాల్ వద్ద రైలుని ఆపి..టీ కప్పులతో వేచి ఉన్న అసిస్టెంట్ ను తిరిగి ఇంజిన్ క్యాబిన్ లోకి ఎక్కించుకున్నాడు.

Also read:AAP Punjab: లోన్ కట్టని రైతులపై అరెస్ట్ వారంట్ జారీచేసిన పంజాబ్ ఆప్ సర్కార్: అంతలోనే దిద్దుబాటు చర్యలు

అనంతరం 5.30 గంటలకు గ్రీన్ సిగ్నల్ పడగా.. రైలు సివాన్ స్టేషన్ నుండి బయలుదేరి హాజీపూర్ వైపు కొనసాగింది. ఈ వ్యవహారంపై ప్రయాణికులు స్టేషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా.. వారు వారణాసిలోని డివిజనల్ రైల్వే మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా క్రాసింగ్ వద్ద టీ కోసం రైలును ఆపిన సమయంలో రైల్వే క్రాసింగ్ కు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయని, అత్యవసరంగా వెళుతున్న అంబులెన్సు కూడా ఆ వాహనాల్లో చిక్కుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని గార్డు, లోకో పైలట్లను ఆదేశించినట్లు ఈశాన్య రైల్వే (ఎన్ఈఆర్) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ సింగ్ తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also Read:Corona in India: దేశంలో 15 వేలు దాటిన యాక్టివ్ కేసులు: వరుసగా ఐదో రోజు రెండు వేలకు పైగా కేసులు

ట్రెండింగ్ వార్తలు