14 ఏళ్ల అన్న తన రెండేళ్ల తమ్ముడిని రైలు కిందకు తోయగా రైలు డ్రైవర్ అప్రమత్తత కారణంగా బాలుడు బ్రతికి బయటపడ్డాడు. బాలుడు క్షేమంగా బయటపడటంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లోని బల్లాబ్‌గర్ స్టేషన్ రైలు ట్రాక్ వెంబడి బాలుడు ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా తన అన్న నెట్టివేయడంతో రైలు పట్టాల మధ్యలోకి వచ్చి పడ్డాడు. అదే సమయంలో ఓ గూడ్స్ రైలు ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తోంది. బాలుడిని గమనించిన రైలు లోకోలో కంగారు మొదలైంది. బాలుడు పట్టాల కింద కనిపించడంతో సడన్ బ్రేక్ వేశాడు.
అయినా రైలు ఆగకుండా బాలుడి మీదనుండి వెళ్లింది. వెంటనే డ్రైవర్ అతని సహాయకుడు రైలు దిగి ఇంజిన్ కింద చిక్కుకున్న బాలుడిని చూశారు. అదృష్టవశాత్తు బాలుడికి ఎటువంటి చిన్న గాయం కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం బాలుడిని తల్లికి అప్పగించారు. ఈ విషయాన్ని లోకో పైలట్ దీవన్ సింగ్, అతని సహాయకుడు అతుల్ ఆనంద్ ఉన్నతాధికారులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఇరువురికి రైల్వే అధికారులు రివార్డులను ప్రకటించారు.