వాన గండం : కర్ణాటక ఎన్నికలు

  • Publish Date - April 23, 2019 / 03:10 PM IST

కర్ణాటక: మూడో దశలో పోలింగ్ జరుగుతున్న ఉత్తర కర్ణాటక, శివమొగ్గ జిల్లాలతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం  కురిసిన వర్షానికి కొన్ని బూత్ లలో  పోలింగ్ కొద్ది సేపు నిలిచి పోయింది.  వర్షం కారణంగా కోస్తా  ప్రాంతంతో పాటు మల్నాడ్ లో కూడా కొన్ని పోలింగ్ బూత్ లలోకూడా  పోలింగ్ కొద్దిసేపు నిలిచి పోయింది.  చాలా  ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.   బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఉడిపి, శివమొగ్గ, ఉత్తర కన్నడ,  చిక్ మగళూరు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కర్ణాటక వాతావరణ శాస్త్రవేత్త సునీల్ గవాస్కర్ చెప్పారు.

శివ మొగ్గ  జిల్లా సాగర్  తాలూకా లోని తలగుప్ప గ్రామంలో కురిసిన భారీ వర్షానికి పోలింగ్ బూత్ సమీపంలో విద్యుత్ స్తంభం విరిగి పడటంతో  పోలింగ్ అరగంట పైగా నిలిచిపోయింది. ఇదిలావుంటే  మరో 48 గంటల పాటు కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు సహా, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు  తెలిపారు. బెంగళూరులో కూడా చెదురు మదురు వర్షాలు నమోదయ్యాయి. జయనగర, విరూపాక్షపుర, జేపీ నగర, జంబూసవారి దిణ్ణె వంటి ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి.  ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా, హొన్నవరా, మరియు సిర్సీలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం మేరకు శివమొగ్గలో  68.39% ,  ఉత్తర కన్నడ నియోజకవర్గాలలో65.58% శాతం ఓట్లు  పోలయ్యాయి.