యూపీలో భారీ వర్షాలు : 48 గంటలు..47 మంది మృతి

  • Publish Date - September 28, 2019 / 05:37 AM IST

ఉత్తర్ ప్రదేశ్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు..వరదలు పోటెత్తడంతో ఇళ్లు కూలిపోతున్నాయి. వృక్షాలు, కరెంటు పోల్స్ పడిపోతున్నాయి. దీంతో 48 గంటల్లో 47 మంది మృత్యువాత పడ్డారు. లక్నో, అమేథీతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పాటు విష సర్పాలు కొట్టుకొచ్చాయి. సర్పాల కాట్ల కారణంగా పలువురు మృతి చెందుతున్నారని రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. ప్రతాప్ ఘర్, రాయ్ బరేలీ ఆరుగురు, చందౌలి, వారణాశిలో నలుగురు, ప్రయాగ్ రాజ్, బారబంకి, మహోడాలో ముగ్గురు, అంబేద్కర్ నగర్‌లో ఇద్దరు, కాన్పూర్, గోరఖ్ పూర్, అయోధ్య తదితర ప్రాంతాల్లో ఒక్కరు మరణించినట్లు అధికారులు తెలిపారు. 

భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. వర్షంతో అతలాకుతలమైన ప్రాంతాలను సందర్శించాలని, పరిస్థితిని అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

లక్నోలో సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో 76.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. నేలకూలిన చెట్లను, విద్యుత్ స్తంభాలను సిబ్బంది తొలగిస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిత్రకోట్, ప్రయాగ్ రాజ్, మిర్జాపూర్, ప్రతాప్ గర్, సుల్తాపూర్, గోరఖ్ పూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. 
Read More : చల్లగాలి కోసం : ఫ్లైట్ విండో ఓపెన్..విమానం ఆలస్యం