బీహార్‌లో వరదలు : 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్

  • Publish Date - September 29, 2019 / 04:25 AM IST

బీహార్ రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని పాట్నాతో సహా దారుణంగా దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మధుబని, కిషన్ గంజ్, ముజఫర్ పూర్, అరరియ, బంకా, సమస్తిపూర్, సహస, పుర్నియ, సహస, కతిహార్, వైశాలి తదితర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదలు భారీగా ప్రవహిస్తుండడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

సహాయక చర్యల కోసం 20 NDRF, 15 SDRF బృందాలను రంగంలోకి దిపింది. దారుణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి బృందాలు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద పరిస్థితిపై సీఎం నితీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. ప్రభావిత జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో నితీష్ మాట్లాడారు. గంగా నది నీటిమట్టంపై ఆరా తీయాలని సూచించారు. ఇదిలా ఉంటే..రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మూట..ముల్లె సర్దుకుని సురక్షిత ప్రాంతానికి వెళుతున్నారు. 

సెప్టెంబర్ 28వ తేదీ శనివారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో జనజీవనం స్తంభించి పోయింది. పలు ప్రాంతాల్లో నీటితో నిండిపోయాయి. ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ, జనతాదళ్ నాయకుడు అజయ్ అలోక్..పలువురి మంత్రుల నివాసాలు కూడా నీటిలో దిగ్భందమయ్యాయి. తన జీవితంలో ఇలాంటి వర్షాలను చూడలేదని..తనింటి గ్రౌండ్ ఫ్లోర్ నీటిలో మునిగిపోయిందని..అజయ్ అలోక్ వెల్లడించారు. 

నలంద మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లోకి వరద నీరు ప్రవేశించింది. ఐసీయూలోకి కూడా నీరు ప్రవేశించడంతో రోగులు, వైద్యులు ఇబ్బందులు పడ్డారు. నీటి మట్టం పెరుగుతుండడంతో రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నీటిని బయటకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ అధికారి కుమార్ రవి తెలిపారు.