Tamil Nadu Rains
Tamil Nadu Rains : తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగాలేకపోవడంతో రోడ్లపై నీరు నదిని తలపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సహాయకచర్యలు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ అర్ధరాత్రి చెన్నై నగరంలో పర్యటించి అధికారులతో మాట్లాడారు.
చదవండి : Chennai Rains : చెన్నైలో భారీవర్షాలు.. రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జాం
లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వెంటనే పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని సూచించారు. అనంతరం కంట్రోల్ రూమ్‌లో అధికారులతో మాట్లాడి నగరంలోని వివిధ ప్రాంతాలను స్క్రీన్‌పై గమనించారు. నీటమునిగిన ప్రాంతాల అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సహాయకచర్యలు చేపట్టాలని కోరారు.
అర్ధరాత్రి సీఎం లోతట్టు ప్రాంతాల్లోకి రావడంతో అక్కడి ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. వర్షాలు కురిసిన ప్రతి సారి తాము నీటిలో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు కూడా తమ కాలనీ వాసులు చాల ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు.