Bengaluru Rains: బెంగళూరులో వర్ష బీభత్సం.. నగరాన్ని ముంచెత్తిన వరదలు, చెరువుల్లా వీధులు, రంగంలోకి బోట్లు, టెకీలకు వర్క్ ఫ్రమ్ హోమ్..

కొన్ని చోట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ప్రజలను తరలించేందుకు బోట్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది.

Bengaluru Rains: బెంగళూరును భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగరం చిగురుటాకులా వణికిపోతోంది. కుండపోత వానలతో బెంగళూరు సిటీలోని చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ప్రజలను తరలించేందుకు బోట్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది.

హోరమావు, నవవర, సిల్క్ బోర్డు, మన్యత టెక్ పార్క్, లింగరాజపురం, కాక్స్ టౌన్, ఫ్రేజర్ టౌన్, సేవా నగర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, వర్షాలు పడినప్పుడల్లా నగరంలో ఇదే పరిస్థితి ఉంటోందని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

భారీ వర్షాలతో నగరాన్ని వరద ముంచెత్తింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక అవస్థలు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కర్నాటక రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.

భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ఇక ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక ఆవేదన చెందుతున్నారు. ఇక ఐటీ ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతం. ఆఫీసులకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో చాలా ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులక వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇంటి నుంచే పని చేయాలని స్పష్టం చేశాయి.

ఇప్పటికే కుండపోత వానలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రానున్న మూడు రోజులు కర్నాటక రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్ట్ స్టేషన్ లో 46.5 ఎంఎం వర్షపాతం నమోదైంది. రాబోయే 48 గంటలు బెంగళూరుకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.

Also Read: ప్రాణం తీసిన పని ఒత్తిడి..! ఓలా ఏఐ ఆర్మ్ ఇంజినీర్ బలవన్మరణం.. టీమ్ మేనేజర్‌పై వేధింపుల ఆరోపణలు..