Bengaluru Techie Death : ప్రాణం తీసిన పని ఒత్తిడి..! ఓలా ఏఐ ఆర్మ్ ఇంజినీర్ బలవన్మరణం.. టీమ్ మేనేజర్‌పై వేధింపుల ఆరోపణలు..
బెంగళూరులోని అగరా చెరువులో నిఖిల్ మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Bengaluru Techie Death : బెంగళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 25ఏళ్ల ఇంజనీర్ బలవన్మరణం కలకలం రేపింది. అతడి పేరు నిఖిల్ సోమవన్షి. ఓలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ‘ఓలా కృత్రిమ్’లో మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సడెన్ గా నిఖిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా, విపరీతమైన పని ఒత్తిడి వల్లే టెకీ నిఖిల్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిఖిల్ మృతికి వర్క్ కల్చర్, మేనేజర్ దురుసు ప్రవర్తనే కారణం అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
నిఖిల్ మృతిపై కంపెనీ స్పందించింది. “ఒక కంపెనీగా, ఈ నష్టం మాకు చాలా బాధాకరం” అని తెలిపింది. నిఖిల్ కీలకమైన జట్టు సభ్యుడు. అతను లేకపోవడం బాధాకరం. అతనితో పని చేసిన వారందరికీ తీవ్రంగా బాధ కలిగిస్తుంది. నిఖిల్ కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. వారితో సంప్రదింపులు జరుపుతున్నాం” అని కంపెనీ తెలిపింది.
నిఖిల్ సెలవులో ఉండగా ఇలా జరిగింది. ఏప్రిల్ 8న నిఖిల్ మేనేజర్‌కు మెసేజ్ చేశాడు. తనకు రెస్ట్ కావాలని కోరాడు. కంపెనీ వెంటనే వ్యక్తిగత సెలవు మంజూరు చేసింది. ఏప్రిల్ 17న ఇంకా కొంత రెస్ట్ అవసరం ఉందని చెప్పడంతో సెలవు పొడిగించాం’ అని కంపెనీ తెలిపింది.
నిఖిల్ బలవన్మరణం ఘటన తీవ్ర కలకలం రేపింది. నిఖిల్ మృతికి ఒత్తిడితో కూడిన పని వాతావరణమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు వారాల క్రితం నిఖిల్ కనిపించకుండా పోయాడు. మే 8న బెంగళూరులోని అగరా చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Also Read: బెగ్గింగ్ మాఫియాలోనే కాదు క్రైమ్ లో కూడా.. ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో 23వేల మందికి పైగా పాకిస్థానీలు
నిఖిల్.. బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుంచి మాస్టర్స్ పూర్తి చేశాడు. మాస్టర్స్ లో 9.30 జీపీఎ స్కోర్ చేశాడు. 2024 ఆగస్ట్ లో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా చేరాడు. టెక్ ఇండస్ట్రీలో ఇదే అతడికి తొలి జాబ్. ఫ్రెషర్ అయినా ఓ ప్రాజెక్టుకు నిఖిల్ నేతృత్వం వహిస్తున్నాడు. ఆ ప్రాజెక్టులో పని చేసిన ఇద్దరు కొలీగ్స్ తప్పుకోవడంతో ఆ పని భారం అంతా నిఖిల్ పైనే పడింది.
టీమ్ మేనేజర్ మీటింగ్స్ లో దారుణంగా మాట్లాడేవాడని, చిన్న చిన్న వాటికి రాద్దాంతం చేసేవాడని నిఖిల్ సహ ఉద్యోగి ఒకరు తెలిపారు. టీమ్ మేనేజర్ టార్చర్ తోనే ప్రాజెక్ట్ నుంచి ఉద్యోగులు వెళ్లిపోయారని ఆరోపించాడు. విపరీతమైన పని ఒత్తిడి, టీమ్ మేనేజర్ వేధింపులు భరించలేకనే నిఖిల్ కూడా ప్రాణాలు తీసుకున్నాడని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. నిఖిల్ ఘటనపై అతడి పాత టీమ్స్ మెంబర్స్ సైతం స్పందించారు. విపరీతమైన పని ఒత్తిడి, ఎక్కువ సేపు పని గంటలు, కంపెనీ పూర్ మేనేజ్ మెంట్ వంటి కారణాలతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.