సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక..అటువంటి దేశంలో ఇతర భాషల గొంతు నొక్కటం సరికాదన్నారు. దేశంలోని ప్రతీ రాష్ట్రానికి వారి వారి భాషలు చాలా ముఖ్యం. ఇది ఇండియానా? లేక హిందియానా అంటూ స్టాలిన్ మండిపడ్డారు. మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ వెంటనే స్పందించాలని..లేదంటే ఇతర రాష్ట్రాలతో కలిసి హిందీ వ్యతిరేక పోరాటం చేస్తామని స్టాలిన్ హెచ్చరించారు.
భారతదేశంలో పలు భాషలు ఉన్నాయనీ..ఆయా రాష్ట్రాల్లో మాతృభాష ఉంటుందనీ..కానీ ఇప్పుడు హిందీ భాషను దేశంలోని ప్రజలపై బలవంతంగా రుద్దటం ఏమిటంటూ ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలను తాము వ్యతిరేకిస్తున్నామన్నీ..ఇటువంటి ప్రకటనలు భారతదేశ ఐక్యతను దెబ్బతీస్తాయన్నారు. అమిత్ షా తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత..ఎంపీ అసదుద్దీన్ ట్వీట్టర్ లో స్పందిస్తూ.. ‘హిందీ భారత దేశంలో అందరి మాతృభాష కాదు. భారతదేశం హిందీ, హిందువులు, హిందూత్వం కంటే చాలా పెద్దది’ అని అన్నారు. మాతృభాషలోని ఆనందాన్ని..సౌకర్యాన్ని మంత్రిగారు గుర్తించాలి అంటు చురకలంటించారు.
కాగా..హిందీ దివస్ 2019 సందర్భంగా శనివారం (సెప్టెంబర్ 14)న అమిత్ షా మాట్లాడుతూ..భారతీయులంతా ఆత్మావలోకనం చేసుకోవలసిన సందర్భమిది. ఇప్పటికే పలు దేశాల్లో వారి మాతృభాషలు కనుమరుగైపోయాయనీ..మాతృభాషను మరచిపోతే..ఆ దేశ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశముందని అన్నారు. మన భాషను వదిలేస్తే దేశ సంస్కృతిని పరిరక్షించుకోలేమన్నారు. భారతదేశంలో భిన్న భాషలు, మాండలికాలే ఈ దేశానికి బలమన్నారు. భారతదేశమంతటా ఓ భాష అంటూ ఉండాలన్నారు.
భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా మాట్లాడేది హిందీ బాషే నని అన్నారు. ఈ రోజు..హిందీ భాషా దినోత్సవం సందర్భంగా..బాపు మరియు ఉక్కుమని సర్దార్ పటేల్ కలలను సాకారం చేసుకోవడానికి మా మాతృభాష వాడకాన్ని పెంచాలని, హిందీ భాషను ఒకే భాషగా ఉపయోగించాలని నేను దేశ పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.