Mohan Bhagwat
RSS chief Mohan Bhagwat : యూపీ ఘజియాబాద్ లో జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో దాడులు చేసే వాళ్లు హిందుత్వ వ్యతిరేకులని అన్నారు. హిందూ ముస్లింలు వేర్వేరు కాదని స్పష్టం చేశారు. పూజించే విధానాన్ని బట్టి ప్రజలను వేరుగా చూడలేమన్నారు. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని, ప్రజల మధ్య ఐక్యత లేకపోతే దేశం అభివృద్ధి చెందదని భగవత్ తేల్చి చెప్పారు.
”ఏ ముస్లిం ఇక్కడ నివసించకూడదు అని హిందువు చెబితే.. అతడు కచ్చితంగా హిందువు కాదు. గోవు పవిత్ర జంతువు. ఇతరులను కించేపరిచే వారు, వారిపై దాడులు చేసేవారు హిందుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే. అటువంటి వారి పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టాలు కఠినంగా వ్యవహరించాలి. 40వేల సంవత్సరాల నుండి ఒకే పూర్వీకుల వారసులు అని నిరూపించబడింది.
భారతదేశ ప్రజలకు ఒకే డీఎన్ఏ ఉంది. రాజకీయాలు ప్రజలను ఏకం చేయలేవు” అని మోహన్ భగవత్ అన్నారు. రాజకీయాలు ప్రజలను ఏకం చేసే సాధనం కాలేవు కానీ, ఐక్యతను వక్రీకరించే ఆయుధం మాత్రం కాగలదు అని అన్నారు. దేశంలో ముస్లింలు ప్రమాదంలో లేరు అని భగవత్ అన్నారు. దేశంలో ఇస్లామ్ ప్రమాదంలో ఉంది అనే ట్రాప్ లో చిక్కుకోవద్దని భగవత్ సూచించారు. జాతిని శక్తిమంతం చేసేందుకు, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి సంఘ్ పని చేస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు.