Jk
Hizbul Chief’s Sons : జమ్ముకశ్మీర్‌లో కొంతమంది తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు..! ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కొందరు ఉగ్రవాదులతో చేతులు కలిపారు..! సైనిక బలగాల కదలికల గురించి ఉగ్రవాదులకు సమాచారం అందిచడంతో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, బలగాల కదలికలను గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చారనే అభియోగాల మీద జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు వారిని తొలగించినట్లు ప్రకటించారు. తొలగింపునకు గురైన వారిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ చీఫ్ సలాహుద్దీన్ కుమారులు సయీద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్‌లు కూడా ఉన్నారు.
Read More : Terrorists: భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్!
వారితో పాటుగా నలుగురు అనంతనాగ్, ముగ్గురు బుద్గమ్‌కు చెందిన వారు ఉండగా.. బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారా జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. వీరందరిని భారత రాజ్యాంగంలోని 311వ ఆర్టికల్ ద్వారా తొలగించినట్లగా తెలుస్తోంది. ఈ ఆర్టికల్ ద్వారా ఉద్వాసనకు గురైతే వారు హైకోర్టులో మాత్రమే ఆ నిర్ణయాన్ని సవాలు చేయగలరు. తొలగింపునకు గురైన వారు పలు రకాలుగా ఉగ్రవాదులకు సాయం అందించారని అధికారులు వెల్లడించారు. హవాలా ద్వారా డబ్బును పొందినట్లు స్పష్టం చేశారు. భద్రతా బలగాలు చేపట్టబోయే కార్యకలాపాల వివరాలను చేరవేసి ఉగ్రవాదులకు సాయపడినట్లు అభియోగాలు మోపారు. దీనిపై మరింత దర్యాప్తు జరపనున్నట్లు చెప్పారు.