పార్కింగ్ ప్లేస్ లో వాహనం చోరీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్కింగ్ సమయంలో వాహనం చోరీ జరిగితే నిర్వాహకుడిదే బాధ్యత అని కోర్టు తీర్పు ఇచ్చింది. వాహనాల పార్కింగ్ కు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు చోరీ జరిగితే దాన్ని నిర్వహిస్తున్న యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాహనానికి ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు.. దాని యజమానిదే బాధ్యత అని బోర్డు పెట్టి తప్పించుకోలేరని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ మోహన్ ఎం.శాంతన గౌడర్, జస్టిస్ అజయ్ రస్తోగీలు తాజ్ మహల్ హోటల్ వర్సెస్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో తీర్పు చెప్పారు.
కేవలం నిర్లక్ష్యం కారణంగా చోరీ జరిగితే పూర్తిగా హోటలే బాధ్యత వహించాలని కోర్టు తెలిపింది. 1998 ఆగస్టు 1న ఢిల్లీలో మారుతీజెన్ కారు చోరీ అయ్యింది. బాధితుడు జాతీయ వినియోగదారుల ఫోరమ్ ని ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. కేసు విచారించిన ఫోరమ్.. బాధ్యత హోటల్ దే అని చెప్పి 2016లో తీర్పు ఇచ్చింది. బాధితుడికి 12శాతం వడ్డీతో రూ.2.80 లక్షల పరిహారం, న్యాయ వివాదాల ఖర్చుల కింద రూ.50వేలు ఇవ్వాలంది. కాగా, తీర్పుని సవాల్ చేస్తూ హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం వినియోగదారుల ఫోరమ్ ఇచ్చిన తీర్పుని సమర్థించింది. పార్కింగ్ లో వాహనం చోరీ జరిగితే నిర్వాహకుడిదే బాధ్యత అని జడ్జిమెంట్ ఇచ్చింది.
కోర్టు తీర్పు పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వందలకు వందలు వసూలు చేసే పార్కింగ్ నిర్వాహకులు.. వాహనాల భద్రతను గాలికి వదిలేస్తున్నారని వాహనదారులు ఆరోపించారు. పార్కింగ్ అట్ ఓనర్స్ రిస్క్ అనే బోర్డు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారిలో మార్పు తెస్తుందని అభిప్రాయపడ్డారు. ఇకపై పార్కింగ్ నిర్వాహకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే అంటున్నారు.