Oracle Employee: ఉద్యోగం నుంచి తీసేసిన ఒరాకిల్.. అయినా బేఫికర్.. ఉబర్ డ్రైవర్‌గా మారిన టెకీ.. బిందాస్ లైఫ్

జాబ్ పోయిందన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా బతికేస్తున్నాడు. దీనికి కారణం అతడి ముందు చూపే. ఉద్యోగం చేసే సమయంలో అతడు చేసిన ఒక పని ఇప్పుడు అతడికి శ్రీరామ రక్షలా నిలిచింది.

  • Published On : April 6, 2026 / 07:26 PM IST
  • టెకీని కాపాడిన ముందు చూపు
  • ఒరాకిల్ లో ఉద్యోగం పోయినా నో టెన్షన్
  • లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తున్నాడు
  • ఉబర్ డ్రైవర్ గా మారిన టెకీ
  • ఆర్థిక భరోసా ఇచ్చిన ఫిక్డ్స్ డిపాజిట్లు.. నెలకు 43వేల రూపాయల ఆదాయం

Oracle Employee: టెక్ పరిశ్రమలో ఉద్యోగ కోతలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ తన ఉద్యోగులను తొలగిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఐటీ ఇండస్ట్రీలో జాబ్ సెక్యూరిటీ అన్నది లేకుండా పోయింది. ఇటీవల ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది.
ఒక భారీ పునర్‌వ్యవస్థీకరణ చర్యలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30వేల ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కొందరు మళ్లీ జాబ్ వెతుక్కునే పనిలో పడ్డారు. మరికొందరు ఫ్యూచర్ గురించి చాలా వర్రీ అవుతున్నారు. అయితే, ఒక టెకీ మాత్రం.. ఒరాకిల్ లో ఉద్యోగం కోల్పోయినా బిందాస్ గా బతికేస్తున్నాడు. ఉబర్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు.

టెక్ పరిశ్రమలో 14 ఏళ్లు పనిచేసిన ఒరాకిల్ మాజీ ఉద్యోగి ఒకరు అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆందోళన చెందలేదు. తన సొంత ఊరైన భువనేశ్వర్‌కు తిరిగి వెళ్లాడు. జాబ్ పోయినా అతడు టెన్షన్ పడటం లేదు. పైగా చాలా కూల్ గా, బిందాస్ గా ఉన్నాడు. దీనికి కారణం అతడు చేసుకున్న ఫిక్డ్స్ డిపాజిట్స్. జాబ్ పోయిన ఆ టెకీకి తల్లిదండ్రుల పేరు మీద ఒకటి, తన మీద, తన భార్య పేరు మీద మరొకటి, ఇలా రెండు ఉమ్మడి ఖాతాలలో ఒక్కొక్కదానిలో 15 లక్షల విలువైన పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ ఖాతాలన్నీ కలిసి నెలకు దాదాపు 28వేలు వడ్డీని అందిస్తున్నాయి. ఇక పలు బ్యాంకుల్లో అదనంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం సుమారు 30 లక్షలు. వీటి ద్వారా నెలకు మరో 15వేలు వడ్డీని అందిస్తున్నాయి.

పైగా అతడికి ఈఎంఐల బాధ లేదు. రుణాల భారమూ లేదు. ఇక అతడికి డ్రైవింగ్ వస్తుంది. అంతే, వెంటనే ఉబెర్ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. తద్వారా స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అదే సమయంలో అతను తన తల్లిదండ్రుల మద్దతుతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలను ప్రశాంతంగా అన్వేషిస్తున్నాడు.

ఆ టెకీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను, ఎస్‌ఐపీలను లేదా ఆధునిక ఆర్థిక పోకడలను అనుసరించకుండా, బదులుగా సాంప్రదాయ పొదుపు అలవాట్లు, సహనం, క్రమశిక్షణపై ఆధారపడ్డాడు. ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయినప్పుడు ఒత్తిడికి గురవకుండా నిలదొక్కుకోవడంలో ఈ “పాతకాలపు” పద్ధతే కీలకంగా మారిందని చెప్పాలి.

రెండు పోస్టల్ ఫిక్డ్స్ డిపాజిట్లు..

ఒక్కొక్కటి రూ.15 లక్షలు
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు
అంతా కలిపి 30 లక్షలు

పోస్టల్ డిపాజిట్ల ద్వారా వచ్చే మొత్తం – నెలకు 28వేలు
బ్యాంక్ ఎఫ్ డీల ద్వారా వచ్చే మొత్తం – నెలకు 15వేలు
ఇలా ఏ పనీ చేయకుండానే నెలకు వచ్చే ఆదాయం – 43వేలు
ఈఎంఐలు లేవు, లోన్లు లేవు.. ఇది మరో బిగ్ రిలీఫ్

ఒరాకిల్ లో జాబ్ పోయినా.. మళ్లీ అలాంటి జాబ్ కోసం అతడు వేచి చూడలేదు. ఉబెర్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు.

ఫిక్డ్స్ డిపాజిట్లు చేసుకోవడం, ఈఎంఐలు, రుణాల బాధ లేకపోవడంతో అతడికి సౌకర్యవంతమైన ఆదాయం వచ్చింది. ఆలోచించడానికి సమయం లభించింది. పైగా ఎటువంటి ఒత్తిడి లేదు. అంతేకాదు బిజినెస్ ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ టెకీ కార్పొరేట్ పని ఒత్తిడిలోకి తిరిగి వెళ్ళడానికి తొందరపడటం లేదు. దానికి బదులుగా అతను చిన్న వ్యాపార ఆలోచనలను అన్వేషిస్తున్నాడు. కుటుంబం నుండి మద్దతు తీసుకుంటున్నాడు. ఈ దశను ఒక ఎదురుదెబ్బగా కాకుండా పునఃప్రారంభంగా ఉపయోగించుకుంటున్నాడు.

ఆ టెకీ ముందు చూపును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇదే అసలైన ఆర్థిక వివేకం అని అంటున్నారు. ”మొదటి రోజు నుంచే ఎల్లప్పుడూ బ్యాకప్ ఉండాలి”. ”ముందు పొదుపు చేయండి, తర్వాత ఖర్చు చేయండి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ”. ”పాతకాలపు ప్రణాళిక నిజంగా ఫలిస్తుంది.” అని చెప్పేందుకు ఇదే నిలువెత్తు నిదర్శనం అని పొగుడుతున్నారు.

Also Read: అక్షయ తృతియ.. ఏరోజు వస్తుంది, ముహూర్తం ఎప్పుడు, ఆరోజున బంగారం ఎందుకు కొనాలి?