వైరల్ ఫోటో : మిలటరీ జాగిలానికి సెల్యూట్ చేసిన ఆర్మీ కమాండర్

భారత ఆర్మీలో టాప్ మోస్ట్ కమాండ్ ఓ మిలటరీ జాగిలానికి సెల్యూట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. జమ్మూకశ్మీర్‌లోని 15 కార్ప్స్ చినార్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్‌కు మిలటరీ జాగిలం ‘మేనక’ వందనం చేసింది. దీనికి కమాండర్ కూడా శాల్యూట్ చేశారు.
ఆర్మీలో ఉన్నతస్థాయి కమాండర్ అయిన కేజేఎస్ థిల్లాన్ మిలటరీ జాగిలానికి శాల్యూట్ చేసిన చిత్రం నెటిజన్ల మనస్సుల్ని దోచుకుంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ఎంతో ఉద్వేగానికి గురవుతున్నారు. ఇది చాలా అద్భుతమని ప్రశంసిస్తున్నారు. ఈ ఫోటో కథ ఏంటో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర ప్రారంభంలో జులై 1న 15 కార్ప్స్ చినార్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ దర్శనం కోసం పవిత్ర గుహకు వెళుతుండగా…దానికి 50మీటర్ల ముందు మిలటరీ జాగిలమైన ‘మేనక’ పేలుడు పదార్థాలను గుర్తించేందుకు తన డ్యూటీని చేస్తోంది. ఈ మిలటరీ జాగిలం మేనక కేవలం పేలుడు పదార్థాలను గుర్తించటం చేస్తే పెద్ద విశేషం కాదు.
కానీ కేజేఎస్ థిల్లాన్ అమర్‌నాథ్ గుహ వద్దకు చేరుకోగానే ‘మేనక’ మిలటరీ నిబంధనల ప్రకారం గౌరవపూర్వకంగా రెండు కాళ్లు పైకి ఎత్తి వందనం చేసింది. ఇదే అసలు విశేషం. భారత సైన్యం సంప్రదాయాల ప్రకారం, సీనియర్ మిలటరీ అధికారులు పరస్పరం వందనం చేసుకోవాలి. అది మిలటరీ సంప్రదాయం. అందుకే లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ కూడా మిలటరీ జాగిలమైన ‘మేనక’కు శాల్యూట్ చేశారు.
ఈ ఫోటోను రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ డే సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ ట్విట్టర్‌లో ‘‘ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన బడ్డీకి వందనం’’ అంటూ పోస్ట్ చేసిన చిత్రాన్ని రీట్వీట్ చేశారు. సైన్యంలో వివిధ కార్యకలాపాల సమయంలో మిలటరీ జాగిలాలు వివిధ దళాలతో పాటు వచ్చి విధులు నిర్వహిస్తుంటాయి. ఉగ్రవాదులు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో మిలటరీ జాగిలాల పాత్ర ఎంతోఉంటుంది. సైన్యానికి ఎంతో సహాయంగా ఉంటాయి ఈ జాగిలాలు. ఉగ్రవాదుల ఆట కట్టించడంలో సహాయపడిన పలు మిలటరీ జాగిలాలకు పతకాలు కూడా ప్రదానం చేశారు. కష్టతరమైన మిలటరీ ఆపరేషన్లలోనూ ఈ జాగిలాలు సహాయపడుతున్నాయని లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ తెలిపారు.
#RVC Day Salute to the Buddy who saved many a lives many a times ???✊ https://t.co/Xr7PQkUiWM
— KJS DHILLON (@Tiny_Dhillon) December 14, 2019