Karur stampede case : సీబీఐ చేతికి కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీ..

Karur stampede case : తమిళనాడు రాష్ట్రం కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును

Karur stampede case : సీబీఐ చేతికి కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీ..

Karur stampede case

Updated On : October 13, 2025 / 11:46 AM IST

Karur stampede case : తమిళనాడు రాష్ట్రం కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కు సుప్రీంకోర్టు అప్పగించింది. అంతేకాదు.. దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ తమిళనాడు నటుడు, తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. సోమవారం తీర్పు ఇచ్చింది. కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకొని తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41మందికిపైగా మృతి చెందగా.. పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ గత వారం సుప్రీంకోర్టులో టీవీకేతోపాటు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.

కేవలం తమిళనాడు పోలీసు అధికారులే విచారణ నిర్వహిస్తే న్యాయమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు సాధ్యం కాదని, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ కేసును విచారణ జరిపించాలని టీవీకే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొంది. అదేవిధంగా.. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరూర్ ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఈ కేసుకు సంబంధించి పలు పిటీషన్లు రావడంతో ఇటీవల సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. సోమవారం తీర్పును ఇచ్చింది. కరూర్ ఘటనపై దర్యాప్తు చేయాలని సీబీఐను ఆదేశించింది. అంతేకాదు.. దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్ ను సుప్రీంకోర్టు నియమించింది.