I bow my head to all bravehearts says Rajnath
Shaurya Diwas: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో అరాచకాలు పెరిగాయని, వీటికి పాకిస్తాన్ ప్రతిఫలం అనుభవిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకేను భారత్ స్వాధీనం చేసుకోనుందా? అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా అనే అనుమానాలు కలిగేలా వ్యాఖ్యానించారు. జమ్మూ-కశ్మీరు, లడఖ్‌లలో అభివృద్ధి ప్రస్థానాన్ని ఇప్పుడే మొదలైందని, ఇది గిల్గిట్-బాల్టిస్థాన్‌ను చేరుకుంటే మన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.
1947 అక్టోబరు 27న భారత వాయు సేన శ్రీనగర్‌లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన ‘శౌర్య దినోత్సవా’లకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దీనిని రద్దు చేయడం వల్ల జమ్మూ-కశ్మీరు ప్రజలపై వివక్ష అంతమైందని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. జమ్మూ-కశ్మీరు, లడఖ్‌లలో అభివృద్ధి ప్రస్థానాన్ని ఇప్పుడే మొదలుపెట్టామన్నారు. గిల్గిట్-బాల్టిస్థాన్‌ను చేరుకుంటే మన లక్ష్యం నెరవేరుతుందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీరు ప్రజలపై పాక్ దురాగతాల గురించి ప్రస్తావిస్తూ.. పొరుగు దేశం దాని పర్యవసానాలను అనుభవించవలసి వస్తుందన్నారు. ఉగ్రవాదానికి మతం లేదన్న ఆయన.. ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం భారత్‌ను టార్గెట్ చేయడమేనని అన్నారు.