ఆరోపణలు నిరూపించు..అమిత్ షాకు నారాయణస్వామి సవాల్

puducherry పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. ఫిబ్రవరి-28న పుదుచ్చేరిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం నారాయణ స్వామి. పుదుచ్చేరిలో కాంగ్రెస్ భారీ అవినీతికి పాల్పడిందని..కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన నిధుల్లో రూ.15వేల కోట్ల సొమ్మును నారాయణ స్వామి అక్రమంగా గాంధీ కుటుంబానికి తరలించారని అమిత్ షా ఆరోపించగా..తనపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయాలని మాజీ సీఎం నారాయణస్వామి సవాల్​ విసిరారు.

ప్రధాని మోడీ ప్రభుత్వ పథకాల కింద రూ.15వేల కోట్లను పంపారని అమిత్ షా అన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. షా వ్యాఖ్యలు.. నాతో పాటు గాంధీ కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్నాయి. దీన్ని ఆయన రుజువు చేయాలి. అలా నిరూపించలేకపోతే ఆయనపై పరువు నష్టం దావా కేసు వేయాల్సి ఉంటుందని నారాయణస్వామి హెచ్చరించారు. ఆరోపణల్ని రుజువు చేయకపోతే..తనతో పాటు పుదుచ్చేరి ప్రజలకూ అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అని నారాయణస్వామి డిమాండ్​ చేశారు.

కాగా, గతనెల 23న పుదుచ్చేరి అసెంబ్లీలో.. అధికార కాంగ్రెస్​ మెజారిటీ పడిపోవడం వల్ల నారాయణ స్వామి సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం అక్కడ ఫిబ్రవరి 25 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఏప్రిల్-6న పుదుచ్చేరి అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు గత శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు