Priyanka Gandhi lashes out at BJP MPs
Priyanka Gandhi Vadra : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్‌ను అవమానించిందని ఆరోపిస్తున్న బీజేపీ ఎంపీలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ‘జై భీమ్’ నినాదం చేయాలని ప్రియాంక గాంధీ సవాల్ విసిరారు.
పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు గుండా గిరి చేశారన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తోందన్న భ్రమలు ప్రజలకు ఉండకూడదని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాషలో ఆయన నిజస్వరూపం కనిపిస్తోందన్నారు. అమిత్ షాను కాపాడేందుకే రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
పార్లమెంట్ లోనికి వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీలను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని మండిపడ్డారు. నా కళ్ళ ముందు మల్లికార్జున ఖర్గేను కిందికి తోసేసారని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిరసన తెలుపుతున్నామని, అయితే, ఇప్పటివరకు ఏమీ జరగలేదన్నారు. అదంతా కుట్రగా ఆమె ఆరోపించారు. మమ్మల్ని అడ్డుకునే వారికి జై భీమ్ అని చెప్పి చూపించమని చెప్పామన్నారు.
‘‘మేం ఏమీ మాట్లాడలేదు. మన రాజ్యాంగం కోసం నినాదాలు చేశాం. ఇంతమంది రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని ఈ దేశ ప్రజలు భావిస్తే.. వారు ఎలాంటి భ్రమలో ఉండకూడదు. ఎందుకంటే.. అమిత్ షా భాష వారి వాస్తవాన్ని బహిర్గతం చేసింది. జై భీమ్ అని కూడా చెప్పలేడు. పార్లమెంట్ ఆవరణలోకి వచ్చి జై భీమ్ అని చెప్పి చూపించాలని సవాల్ చేస్తున్నాను’’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సమర్థిస్తూ వయనాడ్ ఎంపీ ప్రియాంక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ శాంతియుతంగా పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆమె అన్నారు. బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకుని జై భీమ్ నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీ పార్లమెంట్ లోపలికి వెళ్తున్నారని ఆమె చెప్పారు. పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకున్నదెవరు? చెప్పాలన్నారు. రాజ్యాంగం పట్ల అంబెడ్కర్ పట్ల బీజేపీ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు.
Read Also : KTR: ఆ విషయంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి.. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ