ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు.ముఖ్యంగా ఈసారి ఉత్తరప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధానపార్టీలు చెమటోడుస్తున్నాయి.ఎలాగైనా 2014సీన్ రిపీట్ చేయాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది.మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ యూపీ చేజారిపోకూడదని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రియాంక గాంధీని రంగంలోకి దించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా(యూపీ తూర్పు విభాగం) బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ మోడీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆమె విమర్శలను బీజేపీ కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది.
ఇటీవల ప్రియాంక గంగాయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.దీనిపై సోమవారం(మార్చి-25,2019) కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ…నేను కనుక అలహాబాద్-వారణాశి వాటర్ వే మార్గాన్ని పూర్తి చేయకపోయినట్లయితే ప్రియాంక ఎలా గంగా యాత్ర చేపట్టి ఉండేది.ఆమె గంగా జలాన్ని కూడా తాగింది.యూపీఏ హయాంలో ఆమె ఆ నీటిని తాగగలిగేవారా అని ప్రశ్నించారు.2020మార్చి నాటికి గంగానది 100శాతం పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు.అంతేకాకుండా ఢిల్లీ-ప్రయాగ్ రాజ్ ని జలమార్గం ద్వారా కలపడానికి రూ.12,000కోట్ల విలువైన డీపీఆర్ ని ప్రపంచబ్యాంకుకు పంపించబోతున్నట్లు తెలిపారు. త్వరలో ఢిల్లీ-బంగ్లాదేశ్ జలమార్గం గుండా ప్రయాణికులు ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో ప్రయాగ్ రాజ్ నుంచి వారణాశి వరకు ఇటీవల ప్రియాంక గంగాయాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో ప్రత్యేకపూజలు చేసిన ఆమె గంగా నదికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గంగాజలాన్నిప్రియాంక తాగారు.