ఇడ్లీలు అంటే దక్షిణ భారత ప్రజలకు ఎంతగా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఉదయం పూటే కాదు చాలా మంది మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఇడ్లీలు తింటుంటారు. ఆరోగ్యం బాగోలేని వారికి కూడా ఇడ్లీలు పెడుతుంటారు.
సాంబారు, పల్లీల చట్నీ, కొబ్బరి పచ్చడితో కలిసి ఇడ్లీలు తింటుంటాం. పొడి ఇడ్లీ, మినీ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ అంటూ పలు రకాల ఇడ్లీలు లభిస్తుంటాయి. అటువంటి ఇడ్లీలతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కొందరు. ముంబైలో ఓ వీధి వ్యాపారి “ఇడ్లీ శాండ్‌విచ్” చేసి అమ్ముతున్నాడు.
ఆ వీధి వ్యాపారి ఇడ్లీతో చిరుతిండిని తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఇడ్లీపై ఆలుగడ్డను ఉంచి దానిపై మరొక ఇడ్లీ పెట్టి, నూనెలో వేయించాడు. దీన్నే “ఇడ్లీ శాండ్‌విచ్” అనే పేరుతో అమ్ముతున్నాడు. దీన్ని సాంబార్, చట్నీతో కస్టమర్లకు ఇస్తున్నాడు.
దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇడ్లీని బతికించాలని, లేదంటే ఇలా మారిపోతుందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. స్టాండప్ కమెడియన్ రోహన్ షా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఇడ్లీతో ప్రయోగాలు చేస్తూ ఇంత దూరం వెళ్లారని, దీన్ని తయారు చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచిందని చెప్పాడు. ఓ ఆరోగ్యకరమైన ఫుడ్ అని దాన్ని అనారోగ్య ఫుడ్‌గా ఎలా తయారు చేశారో దీని ద్వారా తెలుస్తోందని అన్నాడు.