Nayab Singh Saini: కంప్యూటర్ ఆపరేటర్ నుంచి సీఎం స్థాయికి.. నాయబ్ సింగ్ సైనీకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా..

నాయబ్ సింగ్ సైనీ 1970 జనవరి 5న హర్యానాలోని అంబాలా జిల్లాలోని చిన్న గ్రామమైన మీర్జాపూర్ మజ్రాలో జన్మించారు.

Nayab Singh Saini: కంప్యూటర్ ఆపరేటర్ నుంచి సీఎం స్థాయికి.. నాయబ్ సింగ్ సైనీకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా..

Haryana CM Nayab Singh Saini

Updated On : October 17, 2024 / 2:53 PM IST

Nayab Singh Saini: హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం పంచకులలోని మైదానంలో గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీతో ప్రమాణ స్వీకారం చేయించారు. హరియాణాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా మూడోసారి హరియాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో హరియాణా సీఎంగా సైనీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత తాజాగా రెండోసారి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజనాథ్ సింగ్ తో పాటు పలు రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. సైనీ మంత్రి వర్గంలో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: Nayab Singh Saini: హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం.. హాజరైన మోదీ, చంద్రబాబు.. వీడియోలు వైరల్

నాయబ్ సింగ్ సైనీకి 54ఏళ్లు. ఆయన 1970 జనవరి 5న హర్యానాలోని అంబాలా జిల్లాలోని చిన్న గ్రామమైన మీర్జాపూర్ మజ్రాలో జన్మించారు. అతని తల్లి కుల్వంత్ కౌర్ పంజాబీ. తండ్రి తేలు రామ్ సింగ్ హరియాణాకు చెందిన వ్యక్తి. నాయబ్ పాఠశాల విద్యను హర్యానాలో, గ్రాడ్యుయేషన్ బీహార్ లో, న్యాయ విద్యను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చదివారు. అతను బీహార్ రాష్ట్రం ముజఫర్ పూర్ లోని బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి బీఏ చదివారు. యూపీలోని మీరట్ లో ఉన్న చౌదరి చరణ్ సింగ్ విద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. మొదట ఆర్ఎస్ఎస్, ఆ తరువాత బీజేపీలో చేరారు.

నాయబ్ సింగ్ సైనీ భార్య సుమన్ సైనీ. 2000 సంవత్సరంలో అంబాలాలోని నారాయణ గర్ ప్రాంతం సైనీ మజ్రా గ్రామంలో నాయబ్ సైనీ వివాహం జరిగింది. వారికి కుమారుడు అనికేత్, కుమార్తె వంశిక ఉన్నారు. తల్లి కుల్వంత్ కౌర్ వారితో ఉంటున్నారు. ఆయన భార్య సుమన్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేశారు. 2022లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు. అయితే, ఆమె ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు.

Also Read: KTR: అయినను పోయి రావాలె..! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ ఘాటు విమర్శలు..

నాయబ్ సింగ్ సైనీ ఒకప్పుడు అంబాలాలోని బీజేపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశారు. ఆ తరువాత బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కొనసాగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో అంబాలా జిల్లాలోని నారాయణ గడ్ నియోజకవర్గం నుంచి నాయబ్ సింగ్ విజయం సాధించారు. 2019లోఎంపీగా గెలుపొందారు. 2023 అక్టోబర్ నెలలో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా నాయబ్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం హరియాణా సీఎంగా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు.