If rahul does not become party chief many congressmen suffer says gehlot
Congress: కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిని సెప్టెంబర్ 20లోపు ఎన్నుకోవాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ మాజీ అధినేత అయిన రాహుల్ గాంధీయే మళ్లీ అధ్యక్షుడు అవుతారని అనుకున్నప్పటికీ అందుకు రాహుల్ అనుకూలంగా లేనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో గాంధీ కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పార్టీ అధినేత అయితే ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తన మనసులోని మాటను బయటకి వెల్లడించారు. రాహుల్ గాంధీయే పార్టీ అధినేత కావాలని ఆయన బలంగా చెప్పారు. ఒకవేళ రాహుల్ పార్టీ అధినేత కాకపోతే దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా బాధపడతారని అన్నారు. మారుమాట్లాడకుండా రాహులే ఆ పదవిని తీసుకోవాలని, ఆయనను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటుందని అన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకపోతే దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బాధపడతారు. చాలా మంది ఇళ్లు దాటలేరు కూడా. అందుకే రాహుల్ తనకు తానుగానే ముందుకు వచ్చి ఈ పదవిని చేపట్టాలి. పార్టీ సెంటిమెంట్లను రాహుల్ అర్థం చేసుకోవాలి. నా అభిప్రాయంలో అయితే రాహులే అధినేత కావాలని ఉంది. ఆయనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని నేను అనుకుంటాను’’ అని గెహ్లోత్ అన్నారు.
అయితే మళ్లీ గాంధీ కుటుంబం నుంచే అధినేత రావాలని ఎందుకు అనుకుంటున్నారని గెహ్లోత్ను ప్రశ్నించగా ‘‘ఇందులో తప్పేముంది? ఇక్కడ చర్చ గాంధీ కుటుంబమా గాంధీయేతర కుటుంబమా అనేది కాదు. ఒక పార్టీని నడిపించే నాయకత్వం కావాలి. అందుకు రాహుల్ గాంధీయే సరైన వ్యక్తని నా అభిప్రాయం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కూడా ఆయనే’’ అని సమాధానం ఇచ్చారు.