హంద్వారా ఎన్ కౌంట‌ర్ ముగిసింది

  • Publish Date - March 3, 2019 / 01:26 PM IST

జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో మూడు రోజులుగా జ‌రుగుతున్న ఎన్ కౌంట‌ర్ దాదాపు ముగిసిన‌ట్లేన‌ని ఆదివారం(మార్చి-3,2019) కాశ్మీర్ ఐజీపీ ఎస్పీ ప‌నీ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల డెడ్ బాడీల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఆయ‌న‌ తెలిపారు. ఉగ్రవాదులు జనావాసాల మధ్య నక్కి కాల్పులు జరపడంతో భద్రతాదళాలకు కష్టంగా మారిందని, ఆప‌రేష‌న్ సుదీర్ఘంగా కొన‌సాగ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని తెలిపారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్,ఇద్ద‌రు పోలీసుల‌ను కోల్పోయిన‌ట్లు తెలిపారు.

శుక్రవారం ఉదయం కుప్వారాలోని హంద్వారాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో శుక్రవారం ఉదయం కుప్వారాలోని హంద్వారాలో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగ‌బ‌డ్డారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది సిబ్బంది వెళ్లారు. అదే అదనుగా భావించిన ఉగ్రవాది అప్పటి వరకు చనిపోయినట్లుగా నటించాడు. భద్రతా సిబ్బంది దగ్గరకు రాగానే లేచి వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్,ఇద్ద‌రు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

ఉగ్రవాదులతో పోరాటం స‌మ‌యంలో మూడంతస్థుల భవనాన్ని దళాలు పేల్చివేశాయి. దీంతో అక్కడి నుంచి తప్పించుకొని రెండు పశువుల పాకల్లో ఉగ్ర‌వాదులు దాక్కొన్నారు. దళాలు వాటిని కూడా నేలమట్టం చేశాయి.ఇవాళ  మరో ఇంట్లోకి ఉగ్రవాదులు వెళ్లి చేరారు. దళాలు ఆ ఇంటిని కూడా నేలమట్టం చేశాయి. ఉగ్రవాదులు ఒక ఇంటి నుంచి ఇంటికి మారుతూ దాడులను కొనసాగించ‌డంతో 64 గంట‌ల‌పాటు ఆప‌రేష‌న్ కొన‌సాగింది.