పాలు.. ఇటీవలి కాలంలో బాగా కల్తీ అవుతోంది. నీళ్లు, పౌడర్లు, కెమికల్స్ కలిపేసి విక్రయిస్తున్నారు. చూడటానికి అచ్చం పాలలానే ఉంటాయి. కానీ అందులో క్వాలిటీ ఉండదు,
పాలు.. ఇటీవలి కాలంలో బాగా కల్తీ అవుతోంది. నీళ్లు, పౌడర్లు, కెమికల్స్ కలిపేసి విక్రయిస్తున్నారు. చూడటానికి అచ్చం పాలలానే ఉంటాయి. కానీ అందులో క్వాలిటీ ఉండదు, తాజాదనం ఉండదు. అందుకే తెల్లగా కనిపించేదంతా పాలు.. అని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. పాలు ఎంత నాణ్యంగా ఉన్నాయి, తాజాగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కష్టమే. దీనికి పరిష్కారం కనిపెట్టారు ఐఐటీ పరిశోధకలు. పాల నాణ్యతను, తాజాదనాన్ని నిమిషాల్లో నిక్కచ్చిగా చెప్పేసే పేపర్ సెన్సర్ ని ఐఐటీ-గౌహతి పరిశోధకులు ఆవిష్కరించారు.
సాధారణంగా పాలలో సూక్ష్మజీవుల ఉనికి, వాటి స్థాయిని బట్టి క్షీర నాణ్యత, తాజాదనాన్ని అంచనా వేస్తారు. ఇందుకు ప్రస్తుతం మెథలీన్ బ్లూ తదితర పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని ల్యాబుల్లో నిపుణులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఫలితం రావడానికి గంటలకొద్దీ సమయం పడుతుంది. దీనిపై దృష్టి సారించిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు ప్రాంజల్ చంద్ర, కుల్దీప్ మహతో బృందం… సామాన్య ప్రజలు కూడా అత్యంత సులభంగా, క్షణాల్లో పాల నాణ్యతను తెలుసుకునే సరికొత్త కాగితం సెన్సర్ ను రూపొందించింది.
పశువుల నుంచి సేకరించిన పాలలో ఆల్కలైన్ ఫాస్పేట్ (ఏఎల్ పీ) అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది క్షీర నాణ్యతపై ప్రభావం చూపే ప్రొటీన్. పాలను మరిగించినప్పుడు ఇది పోతుంది. పాలను పరీక్షించినప్పుడు ఆల్కలైన్ ఉందని తేలిందంటే… పాలను సరిగా మరిగించలేదని, నాణ్యత దెబ్బతిందని అర్థం. దీన్ని దృష్టిలో పెట్టుకుని… ఐఐటీ శాస్త్రవేత్తలు యాంటీ-ఏఎల్పీ రసాయనాలతో ప్రత్యేక కాగితాన్ని తయారుచేశారు.
ఆల్కలైన్ ఫాస్పేట్ ఉన్న పాలలో వీరు తయారుచేసిన పేపర్ ఉంచితే… కొద్దిసేపటికి నీలం-ఆకుపచ్చ రంగుల్లోకి మారుతుంది. కాగితం ఎంత ముదురు రంగుల్లోకి మారితే పాలు అంతగా కలుషితమైనట్టు. ఒకవేళ పాలలో ఏఎల్ పీ లేకపోతే కాగితం సెన్సర్ రంగు మారదు అని పరిశోధకులు తెలిపారు.
ప్రాంజల్ చంద్ర బయో సైన్సెస్, బయో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. కుల్దీప్ మహతో రిసెర్చ్ స్కాలర్. ఓ బృందంగా ఏర్పాడి ఈ పేపర్ సెన్సర్ ని కనిపెట్టారు. బయోసెన్సర్స్, బయో ఎలక్ట్రానిక్స్ జర్నల్ లో ఈ పేపర్ సెన్సర్ గురించి కథనం వచ్చింది. ఐఐటీ బృందం మినియేచరైజ్డ్ డిటెక్షన్ కిట్ ను కనిపెట్టారు. ఇంట్లోని కిచెన్ లోనే పాల నాణ్యతను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.