Heatwave Alert
Heatwave Alert: దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరిగింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండల తీవ్రతతోపాటు వారం రోజులపాటు పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్, ప్రయాగ్‌రాజ్‌లలో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఢిల్లీలో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా పూసా, పితంపురా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌తో పాటు సిక్కిం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వేడిగాలలతో మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండ వేడిమి, వేడి గాలుల ప్రభావంతో ఒడిశాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు 12వ తరగతి వరకు ఉన్నఅన్ని పాఠశాలలకు రెండు రోజులుపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. హీట్‌వేవ్ పరిస్థితుల కారణంగా పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోనూ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వారంరోజుల పాటు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి.
పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు వేడి గాలులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. బీహార్ రాష్ట్రంలో తీవ్రమైన వేడిగాలుల నేపథ్యంలో వాతావరణ శాఖ బెగుసరాయ్, నలంద, గయా, అర్వాల్, భోజ్‌పూర్, రోహతాస్, బక్సర్, ఖగారియా, ముంగేర్ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రంలో ఉదయం 10:45 వరకే స్కూల్స్ కొనసాగుతున్నాయి. పాట్నాలో ఈ సీజన్‌లో అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఏప్రిల్ నెల ప్రారంభంలోనే వాతావరణ శాఖ చెప్పింది.