భారత రాజకీయాల్లో ఇవే పరిస్థితులు కొనసాగితే లోక్‌సభ ఎన్నికల్లో ఇక మోదీ..

భారత రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత సందిగ్ధావస్థలో ఉన్నాయి.

INDIA alliance becomes weak after Nitish Kumar exit

INDIA alliance : భారత రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత సందిగ్ధావస్థలో ఉన్నాయి. అత్యంత బలమైన అధికారపక్షకూటమి మరింతగా బలపడుతోంటే.. అత్యంత బలహీనమైన ప్రతిపక్ష కూటమి అంతకంతకూ బలహీనమవుతోంది. అధికారకూటమిలో బీజేపీ పెద్దన్న పాత్రను సమర్థించడానికి భాగస్వామ్య పార్టీలు పోటీపడుతోంటే.. ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్రను వ్యతిరేకించడానికి మిగిలిన పార్టీలు శక్తి వంచనలేకుండా శ్రమిస్తున్నాయి. చివరకు కూటమినే విడిచిపెట్టి వెళ్తున్నాయి.

మరికొన్నిపార్టీలు తాము ఒంటరిగా పోటీచేస్తామని చెబుతూ..కాంగ్రెస్‌ను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తంగా బీహార్ పరిణామాల తర్వాత.. ఇండియా కూటమిలో అసలు ఏఏ పార్టీలు మిగిలున్నాయో, ఉంటాయో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఈ సంకటస్థితి దేశరాజకీయాలను మరింత అనిశ్చితిలోకి నెడుతున్నాయి.

సీట్ల సర్దుబాటు చర్చలు మొద‌లు కాక‌ముందే..

ఇండియా కూటమి కొన్ని నెలల క్రితం ఏర్పాటయినప్పుడు అత్యంత శక్తిమంతంగా కనిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో ఢీ అంటే ఢీ అనే సత్తా ఉందన్న నమ్మకం కలిగింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సంపన్నులు మరింత సంపన్నులుగా మారడం, పేదల స్థితి ఇంకా ఇంకా దిగజారడం వంటి పరిణామాలు పదేళ్లగా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయని ఇండియా కూటమి 2024 ఎన్నికల్లో శక్తిమంతంగా ఉంటుందని చాలా మంది విశ్లేషించారు. కానీ బీజేపీ మాత్రం మొదటి నుంచీ ఇండియా కూటమిని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేస్తూ వచ్చింది.

ఆ కూటమిలో ఉన్న పార్టీలు అసలు మిత్రపక్షాలే కాదని, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయస్థాయిలో ఒకే కూటమిలో ఎలా కలిసి పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలు తథ్యమని, కాంగ్రెస్ పెద్దన్న పాత్రను కూటమిలోని మిగిలిన పార్టీలు అంగీకరించబోవని, ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. చివరకు అదే జరిగింది. సీట్ల సర్దుబాటు చర్చలు మొదలుకాకముందే కాంగ్రెస్‌కు దూరం జరిగేందుకు, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఒంటరి చేసేందుకు ఇండియా కూటమి పార్టీలు పోటీపడుతున్నాయి. కూటమిని ముందుండి నడిపించిన నితీశ్ కుమార్ లాంటి నేతలే ఇప్పుడు నిర్వీర్యం చేసేందుకు తలా ఓ చేయి వేస్తున్నారు.

నాటి, నేటి ప‌రిస్థితులు ఒకేలా లేవు..

2004 నుంచి 2014 మధ్య యూపీఏ అధికారంలో ఉంది. యూపీఏకు నేతృత్వం వహించింది కాంగ్రెస్సే. భాగస్వామ్యపక్షాలన్నీ కాంగ్రెస్ పెద్దరికాన్ని గుర్తించాయి. గౌరవించాయి. చెప్పాలంటే కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు పోటీపడ్డాయి. ప్రభుత్వం కూలిపోకుండా రక్షణ కవచంలా నిలబడ్డాయి. కానీ 2023లో యూపీఏను ఇండియా కూటమిగా మార్చేనాటి పరిస్థితులకు, 2004-2014 మధ్య పరిస్థితులకు చాలా తేడా ఉంది. అది అధికారానికి, ప్రతిపక్షానికి ఉన్నంత తేడా. ఆ తేడానే ఇండియా కూటమి ప్రయాణాన్ని మూడు, నాలుగు సమావేశాల తర్వాత విచ్ఛిన్నకరదశలోకి నడిపిస్తోంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ జాతీయపార్టీ అయినప్పటికీ, దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించిన అనుభవం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేయడానికి ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలు సిద్ధంగా లేరు.

2014లో అధికారం కోల్పోయిన దగ్గరినుంచి అంతకంతకూ బలహీనపడుతున్నట్టుగా కనిపిస్తున్న కాంగ్రెస్‌ను దేశప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించగల పార్టీగా కూటమిలోని మిగిలిన పార్టీలు చూడడం లేదు. దీంతో పాటు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ప్రాంతీయపార్టీల నేతల్లో ఎక్కువమంది ప్రధానిరేసులో తమపేర్లు ఉండాలని ఆకాంక్షించేవారే. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌ కన్నా తమదే బలమైనపార్టీ అన్న అభిప్రాయం కొందరు నేతల్లోఉంది. ప్రధాని పీఠం దిశగా అందరి ఆకాంక్షలు పెరిగిపోయాయి. అందుకే కాంగ్రెస్ వీలయినంత తగ్గి ఉండాలని ఆయా పార్టీలు కోరుకుంటున్నాయి. అలా తగ్గి ఉండేలా ఒత్తిడి తెచ్చే వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ కూటమికి తామే పెద్దన్నగా ఉండాలన్నది కాంగ్రెస్ వాదన. ఫలితంగా ఇండియా కూటమిలో లుకలుకలు బయలుదేరాయి. ఆ విభేదాలు జేడీయూను కూటమిని మార్చేందుకు దారితీశాయి.

ఆత్మ ర‌క్ష‌ణ‌లో కాంగ్రెస్‌..

నిజానికి ఇండియా కూటమి ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది. తెలంగాణలో గెలిచింది. దీనిప్రకారం ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు పరపతి పెరగాలి. కానీ చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఓటమిని చూపి కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు మిగిలిన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మొదట మమత మొహమాటం వదిలిపెట్టారు. తర్వాత ఆప్ అదేబాటలో నడిచింది. కూటములను మార్చడంలో అందరికన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన నితీశ్‌కుమార్ ఏకంగా గుడ్‌బై చెప్పేశారు. ఈ పరిణామాల తర్వాత కాంగ్రెస్‌ ఆత్మరక్షణ ధోరణిలో పడుతుందన్నది నిజం. తనకు కావాల్సిన స్థాయిలో సీట్లు దక్కించుకోవడానికి కాంగ్రెస్ అనేక కష్టనష్టాలను, వ్యయప్రయాసలను ఎదుర్కోవాల్సిఉంటుంది. కూటమిగా ఓ అడుగు ముందుకు వేసే ముందు స్వయంగా తాను రెండడుగుల వెనక్కు వేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధపడాలి. మొత్తంగా ఇండియా కూటమి మనుగడే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి వచ్చింది.

బ‌ల‌హీనంగా మారుతున్న ఇండియా కూట‌మి..

ఇండియా కూటమి నుంచి వైదొలగడానికి నితీశ్ చెప్పిన కారణం.. కూటమిలో తాను తప్ప ఎవరూ పనిచేయడం లేదని, కాంగ్రెస్ బాధ్యతాయుతంగా లేదని. అయితే కూటమి కన్వీనర్ పదవికి రాహుల్ గాంధీ మమతపేరు ప్రతిపాదించడమే అసలు వివాదానికి కారణమన్నది అందరి అభిప్రాయం. మరోవైపు మమత కూడా కాంగ్రెస్‌కు కృతజ్ఞతాభావం ప్రదర్శించలేదు. బెంగాల్‌లో జరిగే రాహుల్ భారత జోడో న్యాయ యాత్రలో పాల్గొనబోమని, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని మమత తెలిపారు. అంతేకాక న్యాయయాత్రలో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. సిలిగురిలో రాహుల్ ప్రసంగించాల్సిన సభ కూడా ఇందులో ఉందంటే కాంగ్రెస్‌పై మమత వ్యవహారశైలి ఎలా మారిపోయిందో అర్ధం చేసుకోచ్చు.

బెంగాల్‌లో ఒంటరిపోటీపై మమత అలా ప్రకటన చేశారో లేదో ఇలా ఆప్ రంగంలోకి దిగింది. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. అంటే కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వడానికి ఆ పార్టీ కోసం ఎలాంటి త్యాగం చేయడానికి కూటమిలోని పార్టీలు సిద్ధంగా లేవు. నితీశ్, మమత, కేజ్రీవాల్ నిర్ణయాలు కాంగ్రెస్‌ను సంకటస్థితిలోకి నెట్టేశాయి. కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో పోటీచేస్తామని కాంగ్రెస్ బలంగా చెప్పలేని పరిస్థితులు కల్పించాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ ఏకపక్షంగా సీట్ల ప్రకటన చేసేశారు. కాంగ్రెస్‌కు 11 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను కాంగ్రెస్ ఖండించింది. ఇంకా చర్చలు సాగుతున్నాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ తెలిపింది.

ఎస్పీనే కాదు కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ అఖిలేశ్ యాదవ్ తరహాలోనే ఏకపక్ష నిర్ణయాలు ప్రకటించవచ్చు లేదా కాంగ్రెస్‌ను వీలయినంత తక్కువసీట్లకు పరిమితం చేయాలన్న ఆలోచనతో పనిచేయవచ్చు. మొత్తంగా వరుస పరిణామాలు ఇండియా కూటమిని అంతకంతకూ బలహీనంగా మార్చివేస్తున్నాయన్నది అంగీకరించాల్సిన నిజం. ఇవే పరిస్థితులు కొనసాగితే లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత బలహీన ఇండియా కూటమి అత్యంత బలంగా ఉన్న ఎన్డీఏ కూటమితో తలపడాల్సివస్తుంది.