దేశ వ్యాప్తంగా ప్రజలు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఎర్రకోట పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
అణుబాంబుల గురించి ప్రస్తావిస్తూ ఇటీవల పాక్ సైన్యాధిపతి మునీర్ చేసిన పిచ్చి ప్రేలాపనల నేపథ్యంలో ఆ దేశానికి మోదీ గట్టి సందేశం ఇచ్చారు. అటువంటి బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పామని, నీరు, రక్తం కలిసి ప్రవహించవని అన్నారు. సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదని స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదని తేల్చిచెప్పారు. దీనిపై చర్చలు ఉండవని అన్నారు.
ఎర్రకోటపై మోదీ ప్రసంగిస్తూ… కోట్లాది మంది త్యాగాలతో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ఇన్నేళ్లుగా మన రాజ్యాంగం మనకు మార్గదర్శనం చేస్తోందని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న వీరజవాన్లకు సెల్యూట్ అని అన్నారు. ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని తెలిపారు. మనసైన్యం దాడులతో పాకిస్థాన్ నిద్రలేని రాత్రులు గడిపిందని అన్నారు.
మన యూపీఐ ప్లాట్‌ఫాం ప్రపంచాన్ని ఏలుతోందని నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ లావాదేవీల్లో భారత్ ముందంజలో ఉందని, యూపీఐ వాటా 50% ఉందని తెలిపారు. మరి మనం ఎందుకు ఇతరులపై ఆధారపడాలి అని ప్రశ్నించారు. మన సామర్థ్యాలపై విశ్వాసం ఉందని, యువత సామర్థ్యాలపై నమ్మకం ఉందని తెలిపారు.
ఇది సమాచార సాంకేతిక యుగం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మనకు సొంత కృత్రిమ మేధస్సు ఎకోసిస్టమ్‌ను ఏర్పరచుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. మన లక్ష్యం స్వదేశీ యుద్ధవిమానాలు తయారు చేయడం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత భవిష్యత్తును ఉన్నతంగా మలచుకోవాలని అన్నారు.
మనం గగనయాన్‌కు సిద్ధమవుతున్నామని చెప్పారు. భారత్‌లో 300 అంతరిక్ష స్టార్టప్‌లు ఉన్నాయని, యువత అంతరిక్ష సాంకేతికతను ముందుకు నడిపిస్తోందని తెలిపారు.
శుభాన్షు శుక్లా ఇటీవల అంతరిక్షం నుంచి తిరిగి వచ్చారని, త్వరలో భారత్‌కి వస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లివచ్చిన శుభాన్షు శుక్లా యాత్రను ప్రశంసించారు.
ప్రస్తుతం భారత్ ఇంధనం దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. ఇంధనంలో స్వావలంబన అవసరమని తెలిపారు.
సౌరశక్తి వినియోగం 30% పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అణుశక్తి కోసం పెద్ద ప్రణాళికలు చేపడుతున్నామని, 2047 నాటికి అణుశక్తి సామర్థ్యం 10 రెట్లు పెరుగుతుందని తెలిపారు.
సాంకేతికతే పురోగతికి దారి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్ తయారీ ఆలోచన 50-60 ఏళ్ల క్రితం వచ్చినా, అమలు కాలేదని చెప్పారు. ఇప్పుడు సెమీకండక్టర్ కార్యక్రమం మిషన్ మోడ్‌లో ఉందని, స్వదేశీ చిప్ త్వరలో మార్కెట్లోకి వచ్చి ప్రపంచ మార్కెట్‌లో దూసుకెళ్తుందని తెలిపారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort. #IndependenceDay
(Video Source: DD) pic.twitter.com/UnthwfL72O
— ANI (@ANI) August 15, 2025