విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రధాని మోదీ విమానాలకు పదే పదే అనుమతి ఇవ్వకపోవడంపై భారత్ సీరియస్ అయ్యింది. నేరుగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. దీంతో సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది పాక్. గగనతలంలోకి అనుమతి ఇవ్వకపోవడంపై ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ -ఐసిఏఓకి కంప్లైంట్ చేసింది భారత ప్రభుత్వం. పదే పదే ప్రధాని మోదీ విమానాలను అడ్డుకోవడం ద్వారా అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమించిందని ఫిర్యాదు చేసింది. సాధారణంగా వివిఐపి హోదా ఉన్న వ్యక్తుల విమానాలను ఏ దేశమైనా తమ గగనతలంపై ప్రయాణానికి అనుమతించడం రొటీన్‌గా జరిగిపోయే ప్రక్రియ అని పేర్కొంది. దీనికి అనుమతులను సర్వసాధారణంగా ఏ దేశమూ రద్దు చేయదని, కానీ పాకిస్తాన్ తన కడుపుమంట కొద్దీ మోదీ విమానాలను అడ్డుకుంటోందని పేర్కొంటున్నారు.
మోదీ సౌదీ పర్యటనకోసం పాక్ మీదుగా వెళ్లాల్సి ఉండగా.. తాజా పరిణామం నేపధ్యంలో అరేబియా సముద్రంపై నుంచి రియాద్‌వైపు ప్రయాణాన్ని మార్చారు. కానీ..అరేబియా సముద్రంలో క్యార్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దుపైన ఉన్న అక్కసుని ఇలా వెళ్లగక్కుతుందంటూ పాకిస్తాన్‌పై అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థకి ఫిర్యాదు చేసింది. ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్-ఐసిఏఓ రూల్స్‌ని తుంగలో తొక్కడమేనంటూ ఫిర్యాదు చేసింది.
ఐసిఏఓ విషయానికి వస్తే..ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే విమానయాన ప్రత్యేక విభాగం. ప్రపంచ విమానరంగంలో పర్యావరణ పరిరక్షణ, రక్షణపరమైన విధానాలలో ప్రమాణాలను నిబంధనలను ఇది అమలు చేస్తుంది. ప్రస్తుతం భారత్ చేసిన ఫిర్యాదుతో పాకిస్తాన్ దుర్భుద్ది ప్రపంచం ముందు మరోసారి చర్చకు రావడం ఖాయంగా కన్పిస్తోంది. కేంద్రం కంప్లైంట్‌తో ఇప్పటికిప్పుడు వెంటనే ఫలితం కన్పించకపోయినా భవిష్యత్తులో భారత అగ్రనేతల విమానాల రాకపోకలకు మార్గం సుగమం అవుతుందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు.
Read More : మోడీకి దారి ఇవ్వం..భారత్ విజ్ణప్తిని మరోసారి తిరస్కరించిన పాక్