తూర్పు ల‌డ‌ఖ్‌లో “మార్కోస్”ని మోహ‌రించిన భారత్

India Deploys MARCOS In Eastern Ladakh దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాను కట్టడి చేయ‌డం కోసం భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న‌ది. ఇందులో భాగంగా స‌రిహ‌ద్దుల్లో త్రివిధ దళాలను మోహరిస్తున్న‌ది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన గరుడ్ ఆపరేటివ్స్, ఆర్మీకి చెందిన పారా స్పెషల్ ఫోర్సెస్ తూర్పు లడఖ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, తాజాగా భారత నావికా దళానికి చెందిన మెరైన్ కమాండోల (మార్కోస్)ను కూడా మోహరించింది.



పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఈ మార్కోస్‌ను మోహ‌రించిన‌ట్లు భార‌త‌ సైన్యం తెలిపింది. ఈ ప్రాంతంలోనే భారత్, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల నుంచి ఘర్షణ, ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. ఈ సరస్సులో సైనికుల‌ కార్యకలాపాల కోసం భార‌త ప్ర‌భుత్వం త్వ‌ర‌లో అత్యాధునిక పడవలను సమకూర్చబోతున్న‌ది.



భారత సైన్యానికి చెందిన పారా స్పెషల్ ఫోర్సెస్ సహా స్పెషల్ ఫోర్సెస్, కేబినెట్ సెక్రటేరియట్‌కు చెందిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ చాలా కాలం నుంచి తూర్పు లడఖ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా,తూర్పు లడఖ్ ప్రాంతంలో ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి భారత వాయుసేనకు చెందిన గరుడ్ స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి.



వాస్తవాధీన రేఖ వెంబడి కొండల పైభాగానికి చేరుకుని, శత్రువుల విమానాలు భారతదేశ గగనతలంలోకి ప్రవేశించకుండా రక్షణ కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 29-30 మధ్య రాత్రి కొండ పైభాగాలకు భారత సైన్యం చేరుకుంది. దీంతో చైనా సైన్యం ఈ ప్రాంతాలను ఆక్రమించకుండా నిరోధించ‌గ‌లిగిన విషయం తెలిసిందే.