President
Statue Of Equality : ముచ్చింతల్ వెలిగిపోతోంది. భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శ్రీరామనగరంలో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రముఖులు, దేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కేంద్ర మంత్రులు, గవర్నర్ లు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, ఇతరుల స్వామీజీల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమం భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతోంది. మరోవైపు 2022, ఫిబ్రవరి 12వ తేదీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాక సందర్భంగా పలు ఏర్పాట్లు చేశారు. వీరి రాక సందర్భంగా పలు ఆంక్షలు ఉంటాయని, భక్తులు సహకరించాలని చిన్న జీయర్ స్వామి సూచించారు.
Read More : Medaram Maha Jatara : మేడారం జాతర.. ఆన్ లైన్‌లోనూ మొక్కులు
2022, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం మధ్యాహ్నం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని సూచించారు. శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత.. చిన్న జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. భక్తులు ఇక్కడకు రాకుండా నియంత్రిస్తారని, ఇందుకు వారు కూడా సహకరించాలని మరోసారి సూచించారు. ఇక శనివారం భీష్మా ఏకాదశి సందర్భంగా విష్ణుసహస్రనామ పారాయణం జరుగుతుందని, మధ్యాహ్నం పూర్ణాహుతి జరిగిన తర్వాత అందరూ యాగశాల చుట్టూ ఒకేసారి తిరిగి పారాయణం చేయడం జరుగుతుందన్నారు. 11.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. 108 దివ్య దేశాల్లో ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, 13వ తేదీ మరికొన్ని ఆలయాల్లో ప్రాణప్రతిష్ట జరుగుతుందన్నారు. ఆలయాలను దర్శించుకొనే విషయంలో పెద్దలు నిర్ణయిస్తారని, 12వ తేదీ, 13వ తేదీల్లో నిర్ణయం ప్రకటించే అవకాశ ఉంటుందని చిన్న జీయిర్ స్వామిజీ తెలిపారు.