×
Ad

Javelin Missiles : ఇండియాకు ‘జావెలిన్ మిస్సైల్’ వచ్చేస్తుంది.. శత్రుదేశాలకు ఇక చుక్కలే.. దీని ప్రత్యేకలు ఏంటో తెలుసా..

Javelin Missile ఎఫ్‌జీఎం-148 జావెలిన్ అనేది ఒక మనిషి మోయగలిగే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఏడీజీఎం). అనగా.. ఇదో ట్యాంక్ విధ్వంసకర క్షపణి.

Javelin Missile

Javelin Missiles : భారతీయ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా అమెరికా నుంచి క్షిపణి రాబోతుంది. 9.3కోట్ల డాలర్ల (సుమారు రూ.825 కోట్ల) ఆయుధాలను భారత్ కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వీటిలో ఎక్స్ క్యాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్లు, జూవెలిన్ యుద్ధ ట్యాంకుల విధ్వంసక వ్యవస్థతో ముడిపడిన పరికరాలు ఉంటాయి. భారత్ దేశానికి అమెరికా నుంచి వచ్చే ఆయుధ సామాగ్రి జాబితాలో 100 జూవెలిన్ ఫిరంగి గుళ్లు, ఒక జావెలిన్ క్షిపణి, 25 తేలికపాటి కమాండ్ లాంఛ్ యూనిట్లు, ఆయుధ సామాగ్రితో ముడిపడిన విడి భాగాలు ఉన్నాయి. వీటిలో.. జూవెలిన్ మిస్సైల్ సిస్టమ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

జూవెలిన్ అంటే ఏమిటి..?
ఎఫ్‌జీఎం-148 జావెలిన్ అనేది ఒక మనిషి మోయగలిగే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఏడీజీఎం). అనగా.. ఇదో ట్యాంక్ విధ్వంసకర క్షిపణి. దీనిని పెద్ద తుపాకీలా భుజంపై ఉంచుకొని శత్రువుల ట్యాంకులపై గురిపెట్టి ప్రయోగించవచ్చు. అధునాతన జావెలిన్ క్షిపణి రష్యాతో పోరులో యుక్రెయిన్‌కు దేవదూతలా వచ్చిన ఈ ఆయుధానికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇది కొన్ని వందల సంఖ్యలో రష్యన్ ట్యాంకులను పేల్చేసింది. ఈ క్షిపణుల నుంచి రక్షణ పొందేందుకు రష్యా.. తమ ట్యాంకులపై ఏకంగా ఇనుప బోన్లను అమర్చింది.

సెన్సర్లకు చిక్కకుండా..
జావెలిన్ క్షిపణి సుమారు మూడున్నర అడుగులు ఉంటుంది. డిస్పోజబుల్ లాంఛ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా రెండు పేలుడు పదార్థాలనూ వీటిలో అమర్చుతారు. ఇవి రీయాక్టీవ్ ఆర్మర్ రక్షణ కవచాలను ఛేదించడం సహా ట్యాంకును ధ్వంసం చేస్తాయి. వీటిని అమెరికాకు చెందిన రేథియాన్, లాక్‌హిడ్ మార్టీన్ అనే రక్షణ రంగానికి చెందిన సంస్థలు అభివృద్ధి చేశాయి. సాధారణంగా.. ట్యాంక్ విధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వెలువడతాయి. ప్రత్యర్థులు హీట్ సెన్సర్లతో వాటిని గుర్తిస్తారు. అయితే, జావెలిన్ క్షిపణితో అలాంటి పరిస్థితి ఉండదు. జావెలిన్‌లో తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటర్ క్షిపణిని బయటకు కొంతదూరం విసురుతుంది. ఆ తరువాత క్షిపణి మోటార్ పనిచేయడం మొదలు పెట్టి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. దీనిని కంప్యూటర్ తో నియంత్రిస్తారు. దీంతో కచ్చితంగా జావెలిన్ ను ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువులకు అర్ధం కాదు. ఈలోపు ప్రయోగించిన వారు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవచ్చు.

జావెలిన్ లో రెండు రకాల మోడ్ లు ఉన్నాయి. ఒకటి.. టాప్ ఎటాక్ మోడ్. ఇది నింగిలోకి దాదాపు 500 అడుగుల ఎత్తు వరకూ పైకిలేచి, శత్రు ట్యాంకు పైభాగంపైకి దూసుకొస్తుంది. ఆ ప్రదేశంలో ట్యాంకు కవచం అంత పటిష్ఠంగా ఉండదు. రెండోది.. డైరెక్ట్ ఎటాక్ ఆప్షన్. ఇది సూటిగా వెళ్లి లక్ష్యాన్ని తాకుతుంది. ఈ విధానంలో బంకర్లు, భవనాలు, సమీపంలోని సైనిక వాహనాలను ధ్వంసం చేయొచ్చు.

జావెలిన్ వ్యవస్థలో క్షిపణి, రీయాజబుల్ కమాండ్ లాంచ్ యూనిట్ (సీఎల్‌యూ) ఉంటాయి. క్షిపణి డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్‌లో ఉంచుతారు. సీఎల్‌యూలో పగలు, రాత్రి చూడగలిగే ఇమేజింగ్ వ్యవస్థలు ఉంటాయి. అందువల్ల ఈ అస్త్రాన్ని భిన్న రకాల వాతావరణాల్లో వినియోగించొచ్చు.