Indian Navy సంచలన నిర్ణయం : స్మార్ట్ ఫోన్‌లు, ఫేస్ బుక్ బ్యాన్

  • Publish Date - December 30, 2019 / 04:38 AM IST

Indian Navyలో స్మార్ట్ ఫోన్‌లను బ్యాన్ చేశారు. నేవీ స్థావరాలు, డాక్ యార్డులు, యుద్ధ నౌకలలో వీటిని ఉపయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా శత్రువులకు సమాచారం అందవేస్తున్నారనే కారణంతో ఫోన్స్‌పై నిషేధం విధించారు. సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసిన ఏడుగురు సిబ్బందిని పట్టుబడిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.

 

2019, డిసెంబర్ 27వ తేదీన ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. నావికాదళ ప్రాంతాల్లో సోషల్ మీడియాలో భాగమైన ఫేస్ బుక్, ఇన్ స్ట్రా గ్రామ్, వాట్సాప్‌లలో పోస్టులు పెట్టడాన్ని నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ నేవీలో పని చేస్తున్న యువకులను పాక్ యువతుల ఎర వేసి రహస్యాలను తెలుసుకొంటోందని ఇటీవలే నేవీ గుర్తించింది.

అందులో భాగంగా ఏడుగురు నేవీ ఉద్యోగస్తులతో పాటు ఓ హవాలా రాకెట్ ఆపరేటర్‌ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. భారత నావికాదళం రహస్యాలను తెలుసుకొనేందుకు సోషల్ మీడియాను ఉపయోగించారని గుర్తించిన భారత నేవీ ఉన్నతాధికారులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

విశాఖపట్టణంలో పాక్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఏడుగరు నౌకాదళ సిబ్బందిని ఇటీవలే విశాఖ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నావికాదళ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా వర్గాలు ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ పేరిట సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ ద్వారా వారిని పట్టుకున్నారు. ఏడుగురిని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. వీరికి జనవరి 03 వరకు రిమాండ్ విధించినట్లు సమాచారం.