Indian Army: ఇండియన్ ఆర్మీ “యూనిఫామ్” గురించి 5 ఆసక్తికర అంశాలు

దేశ రక్షణకోసం పాటుపడుతున్న 1,455,550 మంది సైనికులకు ఈ సరికొత్త "కంబాట్ యూనిఫామ్" అతిత్వరలో అందుబాటులోకి రానుంది

Comabt

Indian Army: ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సైన్యాల్లో ఒకటైన “ఇండియన్ ఆర్మీ” తమ సైనికుల కోసం సరికొత్త యూనిఫాంను సిద్ధంచేసింది. సైనికులు ధరించేందుకు సౌకర్యంగా ఉండేలా, కొండలు గుట్టల్లో శత్రువులను భ్రమింపజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ యూనిఫామ్ ను జనవరి 15న సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిష్కారించారు. దేశ రక్షణకోసం పాటుపడుతున్న 1,455,550 మంది సైనికులకు ఈ సరికొత్త “కంబాట్ యూనిఫామ్” అతిత్వరలో అందుబాటులోకి రానుంది. సులువుగా, తేలిగ్గా ఉండే ఈ ప్రత్యేకమైన యూనిఫామ్ ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకోగలదు. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ సరికొత్త యూనిఫామ్ గురించి ఐదు ఆసక్తికర అంశాలు..

Also read: Formula E in Hyderabad: హైదరాబాద్ కు “ఫార్ములా ఈ” కార్ రేసింగ్

1. ఈ సరికొత్త కంబాట్ యూనిఫామ్ ను “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ” సహకారంతో రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల సైనిక యూనిఫామ్ లను పరిశీలించి, వాటికంటే మెరుగ్గా ఉండేలా ఈ కంబాట్ యూనిఫామ్ ను డిజైన్ చేశారు.

2. పోరాట సమయంలో సైనికులు వెళ్లే ప్రాంతం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారిపోయేలా ఆలివ్ మరియు మట్టి రంగుల్లో ఈ యూనిఫామ్ ను తీర్చిదిద్దారు. ఈ డిజైన్ కారణంగా యుద్ధరంగంలో శత్రువుల కళ్ళను భ్రమింపచేసే వీలుంటుంది. సైనికులు రాళ్లగుట్టల్లో దాక్కున్నపుడు, భూమిపై పడుకున్నప్పుడు శత్రువుల కంటికి చిక్కకుండా జాగ్రత్త పడొచ్చు.

3. కంప్యూటర్ సహాయంతో రూపొందించబడిన “Digital Disruptive Pattern” సాధారణ కంటిని ఏమార్చుతుంది. ప్రస్తుతం భారత ఆర్మీ వద్దనున్న కంబాట్ యూనిఫామ్ ను గరిష్టంగా 18 నెలల పాటు ధరిస్తుండగా.. ఈ సరికొత్త యూనిఫామ్ ఎక్కువకాలం మన్నికగా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేశారు. 70 శాతం కాటన్‌, 30 శాతం పాలిస్టర్‌ను ఉపయోగించి తయారు చేసిన ఈ యూనిఫామ్ ను అతిశీతల, ఉష్ణప్రాంతాల్లోనూ ధరించవచ్చు.

Also read: Tiger Death: మధ్యప్రదేశ్ వన్యప్రాణి ముఖచిత్రంగా నిలిచిన “కాలర్ వాలి పులి” మృతి

4. ప్రస్తుతం ఆర్మీ వద్దనున్న కంబాట్ యూనిఫామ్ ను టక్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ లోపలి భాగంలో చొక్కా ఉంటుంది. అయితే సరికొత్త కంబాట్ యూనిఫామ్ ను టక్ చేయాల్సిన అవసరం లేదు. షర్ట్ స్థానంలో టీ-షర్ట్ ఉంచారు. ఈ యూనిఫామ్ ధరిస్తే ప్యాంటు బెల్టు బయటకు కనిపించదు.

5. కొత్త కంబాట్ యూనిఫామ్ బహిరంగ మార్కెట్లో లభించకుండా జాగ్రత్త వహించారు. ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వస్త్రానికి నకలు సృష్టించడం చాలా కష్టం పైగా ఖర్చుతో కూడుకున్నది. దీంతో ఇది బహిరంగ మార్కెట్లో లభించే అవకాశం లేదు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ వద్దనున్న కంబాట్ యూనిఫామ్ కు నకళ్లు బహిరంగ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని కొనుగులో చేసే కొందరు వ్యక్తులు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు.

అతి త్వరలో ఈ సరికొత్త “కంబాట్ యూనిఫామ్” భారత సైనికులకు అందుబాటులో రానుంది.

Also read: Taliban: మహిళా నిరసనకారులపై తాలిబాన్ల పెప్పర్ స్ప్రే

ట్రెండింగ్ వార్తలు