నేటి నుంచి ఐపీఎల్‌ సమరం : వన్డే వరల్డ్‌ కప్‌కు ముందే తొలిసారిగా

  • Publish Date - March 23, 2019 / 03:28 AM IST

దేశం మొత్తం ఎన్నికల వేడి నడుస్తోంది. దీనికి తోడు క్రికెట్‌ హడావుడి మొదలవుతోంది. ఊపిరిబిగపట్టే క్షణాలకు.. ఉత్కంఠ రేపే సన్నివేశాలకు ఆసన్నమైంది. వన్డే ప్రపంచకప్‌కు ముందే క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం. ఎప్పుడెప్పుడా అని క్రికెట్‌లోకం ఎదురు చూస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సమరం రానేవచ్చింది. గత 11 ఏళ్లుగా ప్రపంచ క్రికెట్‌ అభిమానులను మంత్రముగ్దులను చేస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సందడి మొదలు కానుంది. ఐపీఎల్‌ పన్నెండో సీజన్‌ ఇవాళ ప్రారంభం కానుంది. ఇందుకు సర్వం సిద్ధమైంది. 
Read Also : నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం

ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి. ఇప్పటి వరకు జట్టులో సహచరులుగా కలిసి ఆడినవారే ప్రత్యర్థులుగా మారబోతున్నారు. ఫ్యాన్స్‌ కూడా ఫ్రాంచైజీల వారీగా విడిపోయి అభిమాన ఆటగాళ్లకు మద్దతు పలికేందుకు సిద్ధమవుతున్నారు.  అనామక ఆటగాళ్లు భారత క్రికెట్ తెరపై హీరోలుగా మారేందుకు మంచి అవకాశం ఇది. 

ఈసారి జరిగే లీగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు తొలిసారిగా ఐపీఎల్‌ జరగబోతోంది. ఈ సీజన్‌ లీగ్‌  ఫైనల్ మే 12న ముగుస్తుండగా… మే 31 నుంచి మెగా టోర్నీ మొదలవనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ను కాపాడుకోవాలనుకుంటోంది. క్రితంసారే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ జట్టు టైటిల్‌ అందుకుంది. జట్టులోని సీనియర్లు ఇప్పుడు మరింత సీనియర్లుగా మారిన వేళ నాలుగోసారి విజేతగా నిలుస్తుందా అనేది చూడాలి. ముంబై ఇండియన్‌ కూడా సిరీస్‌పై కన్నేసింది.

ఐపీఎల్‌ ఆరంభ షోలోనే బొమ్మ అదిరిపోనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు ఆరంభం మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. భారత క్రికెట్‌ సూపర్‌ స్టార్లు ధోనీ, విరాట్‌ కోహ్లీ తమ విన్యాసాలతో అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. ఈ మ్యాచ్‌లో బోణీ ఎవరు కొడతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Read Also : నన్ను కొట్టడానికి 100మంది వచ్చి.. చప్పట్లు కొట్టి వెళ్లారు