Viral Video: ప్రయాణికులకు అందించే ముందు ఆహారాన్ని రుచి చూస్తున్న ఎలుకలు.. ఇలాంటి ఫుడ్ తింటున్నామా?

చిలక కొరికిన పండును కాదు.. ఎలుక తిన్న ఆహారాన్ని ప్రయాణికులు తినాల్సి వస్తోంది.

Maharashtra Goa train pantry car

IRCTC: ఆహారం తినే సమయంలో ఇంట్లో ఎలుకలు కనపడితే కొందరికి వికారంగా అనిపిస్తుంది. ఇక ఆహారం తినాలనిపించదు. అటువంటిది.. తినే ఆహారంపై ఎలుకలు తిరిగితే? ఆ ఆహారాన్ని ఇక ముట్టుకుంటామా? ఎలుకలు తిన్న ఆహారాన్ని మనం తింటామా? ఊహించుకుంటేనే ఏదోలా ఉంది కదూ?

భారతీయ రైల్వేలో ఇటువంటి ఆహారాన్నే అందించారని ఆరోపణలు వస్తున్నాయి. లోకమాన్య తిలక్ టెర్మినస్ మడ్గావ్ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీలో ఎలుకలు తిరిగిన వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ప్రయాణికులకు ఇటువంటి ఆహారాన్ని అందిస్తారా? అని నిలదీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రైల్వేలో పరిశుభ్రతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

‘ఇది చూడండి. ప్రయాణికులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడం, నాణ్యతను పరిశీలించడమే లక్ష్యంగా మన భారతీయ రైల్వే ఫ్యాంట్రీ కార్స్ లో ఫుడ్ టేస్టర్లను నియమించింది’ అంటూ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ యూజర్ ఎద్దేవా చేశాడు.

రైల్వే నియమించిన ఫుడ్ టేస్టర్ ఎవరో కాదు ఎలుకలే అంటూ చురకలు అంటించాడు. అక్టోబరు 14న 11009 ఎల్టీటీ మాడ్గావ్ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ కార్ లోపల భారతీయ రైల్వే ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసిందని ఎద్దేవా చేశాడు. ఆ ఎక్స్‌ప్రెస్ రైలు మహారాష్ట్ర-గోవా మధ్య సేవలు అందిస్తుంది.

దీనిపై భారతీయ ఐఆర్సీటీసీ స్పందించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, తగిన చర్యలు తీసుకున్నామని చెప్పింది. పరిశుభ్రత పాటించేలా ప్యాంట్రీ కార్ సిబ్బందికి సూచనలు చేశామని తెలిపింది. పురుగులు, ఎలుకలు వంటివి లేకుండా అన్ని చర్యలు తీసుకునేలా సూచించామని భారతీయ రైల్వే ట్విటర్ లో పేర్కొంది.

Israel Palestine Conflict: ఇజ్రాయెల్‭పై దాడికి ఉత్తర కొరియా ఆయుధాలను ఉపయోగించిన హమాస్