పాలసీ రద్దయిందా?.. ఎలా పునరుద్ధరించుకోవాలి?

  • Published By: Suresh Kumar ,Published On : August 13, 2020 / 06:24 PM IST
పాలసీ రద్దయిందా?.. ఎలా పునరుద్ధరించుకోవాలి?

Updated On : August 13, 2020 / 6:24 PM IST

      మీరు జీవిత బీమా పాలసీ కలగి ఉండి, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రీమియం చెల్లించకపోవడంతో పాలసీ రద్దు అయిందా? పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పాలసీని పునరుద్దరణ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారా? ఇది సాధ్యమవుతుందా? బీమా సంస్థలు ఇలాంటి సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయా? రండి ఈ ప్రశ్నలకు బీమా రంగ నిపుణులైన నవల్ గోయల్(PolicyX.com, సీఈఓ)ని అడిగి తెలుసుకుందాం.

 మీ జీవిత బీమా పాలసీ రద్దు అయినట్లయితే, అది అందించే ఆర్థిక రక్షణను కూడా మీరు ఆస్వాదించలేరు. ప్రీమియంలు చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. దానివల్ల పాలసీదారుడు ఎటువంటి కవరేజీకి అర్హుడు కాడు మరియు డెత్ బెనిఫిట్ వంటి ఇతర ప్రయోజనాలు సైతం కోల్పోతాడు. దీనివల్ల అసలు మీరు ఎందుకు పాలసీని తీసుకున్నారో, ఆ లక్ష్యం నెరవేరదు. సాధారణంగా గ్రేస్ పిరియడ్‌లో కూడా ప్రీమియాన్ని చెల్లించకపోతే పాలసీ రద్దు అవుతుంది.

 గ్రేస్ పిరియడ్ అంటే ఏమిటి?

ఒక వేళ మీరు నిర్ణీత తేదీలోపు ప్రీమియం చెల్లించకపోతే, బీమా సంస్థలు ప్రీమియంపై వడ్డీ విధించకుండా చెల్లింపులు చేయడానికి కొంత అదనపు సమయాన్నిఇస్తాయి. దీన్నే గ్రేస్ పిరియడ్ అంటారు. నెలవారీగా చేసే ప్రీమియం చెల్లింపులకు గ్రేస్ పిరియడ్ 15 రోజులు. అదే ఆరు నెలలు, సంవత్సరానికి ఒకసారి ప్రీమియాన్ని చెల్లిస్తుంటే గ్రేస్ పిరియడ్ నెల రోజులుగా ఉంటుంది.

పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించకపోతే ఏమవుతుంది?

పాలసీదారుడు ప్రీమియాన్ని నిర్ణీత వ్యవధిలోపు చెల్లించకపోతే, గ్రేస్ పిరియడ్ వ్యవధి అమలులోకి వస్తుంది. అప్పటికీ పాలసీదారుడు చెల్లింపు చేయకపోతే పాలసీ రద్దు అవుతుంది. మళ్లీ పాలసీ పునరుద్దరించే వరకు, ఎటువంటి కవరేజీ మరియు ప్రయోజనాలు సదరు పాలసీదారునికి వర్తించవు.

రదైన పాలసీలను పునరుద్దరించుకోవడం ఎలా?

ఆరు నెలలోపు అయితే: మీ పాలసీ రద్దైన 6 నెలలోపు మీరు పాలసీ పునరుద్దరించుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం. మీరు సదరు బీమా సంస్థను సంప్రదించి మొత్తం చెల్లించాల్సిన ప్రీమియం మరియు ఏదైనా వడ్డీ విధిస్తే దానిని కూడా కలిపి చెల్లిస్తే మళ్లీ పాలసీ పునరుద్దరించబడుతుంది. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో కూడా సులభంగా చేయవచ్చు.

ఆరు నెలలు దాటితే: పాలసీ రద్దు అయిన ఆరు నెలల తర్వాత మీరు పునరుద్దరణ చేయాలనుకుంటే, చెల్లించాల్సిన ప్రీమయంలతో పాటు వడ్డీని కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు 12- 18 శాతం మధ్య ఉంటాయి. అలాగే బీమా నిబంధనలు కూడా పాలసీని బట్టి మారుతూ ఉంటాయి. మీ జీవిత బీమా పునరుద్దరణ మీ బీమా సంస్థ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. మీ పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులు మారవచ్చు, ప్రీమియాన్ని పెంచవచ్చు.  అలాగే మరలా వైద్య పరీక్షలు కోసం అడగవచ్చు.

అందుకే వీలైనంత త్వరగా పాలసీని పునరుద్ధరించడం చాలా అవసరం. దీని వల్ల ఎక్కువ వడ్డీలు మరియు జరిమానాలు, ఇతర షరతుల నుంచి తప్పించుకోవచ్చు. జీవిత‌బీమా అనేది మీతో పాటు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. మీరు నిర్ణీత గడువులోపు ప్రీమియం చెల్లించలేకపోతే, ఆరు నెలలలోపు పాలసీని పునరుద్దరణ చేసుకోవడం మంచిది.

ఎల్ఐసి పాలసీలకు ఇదే విధానం వర్తిస్తుందా.. ఏమైన సడలింపులు ఉన్నాయా?

జీవిత బీమా సంస్థ(ఎల్ఐసి) తన వినియోగదారుల కోసం ఈ విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. పాలసీదారుడు ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రీమియంలు చెల్లించలేని పరిస్థతి ఏర్పడితే లింక్ చేయని పాలసీలకు ఐదేళ్లు, యూనిట్ లింక్డ్ పాలసీలకు మూడేళ్ల గడువును ఇస్తుంది. ఈ గడువులో పాలసీదారుడు తిరిగి బీమా పథకాన్ని పునరుద్దరించుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పాలసీని సదరు వినియోగదారుడు జనవరి 1, 2014 సంవత్సరం తర్వాత కొనుగోలు చేసి ఉండాలి.

ప్రస్తుతం ఎల్ఐసి పాలసీని పునరుద్దరించుకునే అవకాశం ఉందా?

రద్దైన పాలసీల పునరుద్దరణకు ఎల్ఐసి రెండు నెలల ప్రత్యేక విండోను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విండో ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 9 వరకు నడుస్తుంది. అనివార్య పరిస్థితుల కారణంగా ప్రీమియం చెల్లించలేకపోయిన పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఎల్ఐసి తెలిపింది.

విండో విధానం అంటే ఏమిటి?

ఉదాహరణకు మీకు ఒక జీవిత బీమా పాలసీ ఉంది. రెండేళ్ల పాటు ప్రీమియాన్ని చెల్లించారు. మూడో ఏడాది ఆర్థిక సమస్యల కారణంగా  ప్రీమియాన్ని చెల్లించలేకపోయారు అనుకుందాం. అప్పుడు మీ పాలసీ రద్దు అవుతుంది. మీ బీమా సంస్థ విండో విధానాన్ని ప్రవేశ‌పెట్టినప్పుడు ప్రీమియంతో పాటు ఆలస్యరుసుమును చెల్లించి మీరు మరలా మీ పాలసీని పునరిద్ధరించుకోవచ్చు.ఈ విండో విధానం వల్ల ప్రయోజనం ఏమిటంటే, చెల్లించాల్సి వడ్డీ , ఆలస్యరుసములపై రాయితీ లభిస్తుంది. కొన్ని బీమా సంస్థలు విండో క్యాంపెన్ల సమయంలో ఆలస్య రుసుములను మాఫీ కూడా చేస్తాయి.

విండో క్యాంపెన్ల ముఖ్య ఉద్దేశం ఏమిటి?

అనివార్య పరిస్థితుల కారణంగా ప్రీమియం చెల్లించలేక పోయిన వినియోగదారులకు, ఈ విండో క్యాంపెన్లు ప్రయోజనాలును కలిగిస్తాయి. ఈ విండో క్యాంపెన్ల సమయంలో పాలసీదారులు బీమా పథకం పునరుద్దరణకు ప్రీమియంతో పాటు, ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ సమయంలో బీమా సంస్థలు వినియోగదారుల కోసం వివిధ రాయితీలను ప్రకటిస్తూ ఉంటాయి. 

మిగతా బీమా సంస్థలు కూడా ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయా?

పాలసీ రద్దు అయిన తేదీ నుంచి రెండేళ్ల వ్యవధి వరకు పాలసీ పునరుద్ధరణను దాదాపు అన్ని బీమా సంస్థలు అనుమతిస్తున్నాయి. సంబంధిత బీమా సంస్థ శాఖను నేరుగా సంప్రదించి పాలసీ పునరుద్దరణ చేసుకోవచ్చు. అలాగే అన్ని బీమా సంస్థలు కూడా ఎల్ఐసి‌లానే విండో క్యాంపెన్లు నిర్వహిస్తూ ఉంటాయి. వీటి ద్వారా కూడా పాలసీని పునరుద్ధరణ చేసుకోవచ్చు. అయితే పునరుద్ధరణ నిబంధనలు అనేవి సదరు బీమా సంస్థల నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. 

పునరుద్దరణకు బదులుగా కొత్త బీమా పథకాన్ని తీసుకుంటే మంచిదా?

సాధారణంగా బీమా పాలసీల ప్రీమియం వయసు ఆధారంగా పెరుగుతూ ఉంటుంది…

ఉదాహరణకు కుమార్(25) జీవిత బీమా ప్లాన్‌ను కొనుగోలు చేశాడనుకుందాం. అతని వార్షిక ప్రీమియం 9000. రెండు సంవత్సరాల ప్రీమియం చెల్లించిన తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా కూమార్ మూడో ఏడాది ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దు అవుతుంది. రెండు సంవత్సరాలకు గాను అతను చెల్లించిన ప్రీమియం 18000. కొన్ని రోజులు తర్వాత కుమార్ పాలసీని పునరుద్దరించుకోవడానికి నిర్ణయించుకున్నాడు బకాయి ఉన్న ప్రీమియంతో పాటు ఆలస్య రుసములు మరియు జరిమానాలు కలిపి రూ. 15000 చెల్లించి పాలసీ పునరుద్దరించుకున్నాడు. 

మూడో సంవత్సరంలో కుమార్(28) పాలసీ పునరుద్ధరణ కాకుండా కొత్త పాలసీ కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాడని అనుకుందాం అప్పుడు అతడు సంవత్సరానికి చెల్లించాల్సి ప్రీమియం 12000. పాత పాలసీకి చెల్లించిన 18000 నష్టంతో పాటు కొత్త పాలసీకి అదనంగా రూ. 12,000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొత్త పాలసీ నిబంధనలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త పాలసీ కొనుగోలు కంటే పాత పాలసీ పునరుద్ధరణే ఉత్తమం.

నవల్ గోయల్ (PolicyX.com CEO)