ISRO: ఇస్రో కీలక ప్రయోగం.. డాకింగ్ సత్తా కలిగిన నాల్గో దేశంగా అవతరించనున్న భారత్

ఇస్రో కీలక ప్రయోగానికి సమాయత్తం అవుతుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ60ని ఇవాళ రాత్రికి ప్రయోగించనుంది.

ISRO PSLV-C60 Mission

PSLV C-60 Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సమాయత్తం అవుతుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ60ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 8.58గంటలకు కౌంట్ డాన్ ప్రారంభమైంది. సోమవారం రాత్రి 9.50 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ-సీ60 ద్వారా స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి ఇస్రో పంపనుంది. ఈ జంట ఉపగ్రహాలకు ఛేజర్, టార్గెట్ అనే పేర్లను శాస్త్రవేత్తలు పెట్టారు. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం, తదితర సేవలకు ఉపయోగపడనున్నాయని ఇస్రో వెల్లడించింది. అదేవిధంగా భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్-4లో, భారత్ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. డాకింగ్ సత్తా కలిగిన నాల్గో దేశంగా భారత్ అవతరిస్తుంది.

Also Read: Air plane crash: వామ్మో ఘోర విమాన ప్రమాదాలు.. ఈ నెలలో ఎక్కడెక్కడ, ఎన్ని జరిగాయో తెలుసా?

అంతరిక్షంలో రెండు వేర్వేరు వ్యోమనౌకలు అనుసంధానం కావడాన్ని డాకింగ్ అంటారు. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు వాటి వేగాన్ని నియంత్రించుకుంటూ ఒకదానికొకటి చేరువవుతూ, కమ్యూనికేషన్ సాగించుకుంటూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని విచ్ఛిన్నమైపోతాయి. ఇది సాంకేతికంగా చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే.. ప్రస్తుతం డాకింగ్ సామర్థ్యం కలిగి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత దేశం నిలుస్తుంది. భారత్ చేపట్టబోయే మానవరహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కు డాకింగ్ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాక.. కక్ష్యలోని ఉపగ్రహాలకు మరమ్మతులు, ఇంధనం నింపడం, ఆధునికీకరణకు ఈ డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ శాటిలైట్ల జీవితకాలం పెరుగుతుంది.

Also Read: Joe Biden: అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నందుకు జో బైడెన్ బాధపడుతున్నారా?

స్పేడెక్స్ ప్రాజెక్టు కింద ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను సోమవారం విడివిడిగా ప్రయోగస్తారు. వీటి బరువు సుమారు 440 కిలోలు ఉంటుంది. ఇవి రెండూ పీఎస్ఎల్వీ-సీ60 మిషన్ తోనే నింగిలోకి దూసుకెళ్తాయి. అయితే, నేలకు 470 కిలో మీటర్ల దూరంలోని వృత్తాకార కక్ష్యలో వాటిని విడివిడిగా ప్రవేశపెడతారు. రెండు శాటిలైట్ల మధ్య దూరం 20 కిలోమీటర్లకు చేరుకున్నాక.. వాటి మధ్య దూరం పెరగడం ఆగిపోయేలా చేస్తారు. ఇందుకోసం రెండు ఉపగ్రహాల్లోని రాకెట్లను సమయానుకూలంగా మండిస్తారు. ప్రయోగించిన ఐదో రోజు నుంచి రెండు ఉపగ్రహాలను దగ్గరకు తీసుకురావడం మొదలవుతుంది. వాటిలోని వ్యవస్థలను పరీక్షించాక నిర్దేశిత రోజున డాకింగ్ కోసం వాటికి ఆదేశాలు జారీ చేస్తారు.

 


అయితే, డాకింగ్ నిర్వహించడానికి అనువైన సమయం ఉంటుంది. ముఖ్యంగా.. సూర్యకిరణాలు సరియైన దిశలో పడాలి. దీనివల్ల ఉపగ్రహాలు సౌరశక్తిని ఒడిసిపట్టి, పవర్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకుంటాయి. అదే సమయంలో శాటిలైట్లలోని స్టార్ సెన్షర్లకు చంద్రుడు, సూర్యుడి వల్ల అవరోధం ఏర్పడకూడదు. ప్రయోగం ప్రారంభమైన ఐదు రోజుల నుంచి అంటే.. జనవరి 4వ తేదీ నుంచి పది రోజుల పాటు డాకింగ్ కు అనువైన సమయం ఉంటుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయంలోకి భారత్ అడుగుపెట్టినట్లు అవుతుంది.