PSLV C56: ఇస్రో పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగం.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రైమరీ పేలోడ్‌ ద్వారా DS-SAR ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు.

PSLV C56 - ISRO

PSLV C56 – ISRO: చంద్రయాన్-3ను ఇటీవలే విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇప్పుడు పీఎస్ఎల్వీ-సీ56 (PSLV-C56)ను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (Satish Dhawan Space Centre – SDSC) నుంచి జులై 30న ఉదయం 6.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఏంటీ ఈ PSLV-C56 మిషన్?
పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రైమరీ పేలోడ్‌ ద్వారా DS-SAR ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు. 360 కిలోల ఈ ఉపగ్రహాన్ని సింగపూర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (DSTA), ఎస్టీ ఇంజనీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. DS-SAR ఉపగ్రహంలో సింథటిక్ అపెర్చర్ రాడార్ (SAR) పేలోడ్ ఉంటుంది. ఈ SARను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) అభివృద్ధి చేసింది.

అలాగే, పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగం ద్వారా మరో ఆరు చిన్న పేలోడ్‌లను పంపుతారు. పీఎస్ఎల్వీ-సీ56 వాహకనౌక 44.4 మీటర్ల పొడవుతో, 228 టన్నుల బరువుతో ఉంది. ఉపగ్రహాన్ని ఈ వాహకనౌక 535 కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెడుతుంది. పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగం ద్వారా కక్ష్యలోకి పంపనున్న మరో ఆరు చిన్న ఉపగ్రహాలు.. వెలాక్స్‌-ఏఎం (VELOX-AM), ఆర్కేడ్‌ (ARCADE), స్కూబ్‌-2 (SCOOB-II), నూలియన్‌ (NuLIoN), గలాసియా-2 (Galassia-2), ఓఆర్‌బీ-12 స్ట్రైడర్‌ (ORB-12 STRIDER).

పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో 94 శాతం సక్సెస్
పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రో 94 శాతం విజయాలు సాధించింది. అంతరిక్ష సాంకేతికతలో SLV-C56 మరోసారి ఇస్రో సామర్థ్యాన్ని తెలియజేయడమే కాదు.. ఈ ప్రయోగం అంతరిక్ష పరిశోధన, అన్వేషణలో అంతర్జాతీయ సహకారాలను పెంచుతుంది.

Bengaluru : బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు .. చూసేందుకు ఎగబడ్డ స్ధానికులు