Sonam Wangchuk Arrest: లద్దాఖ్ అల్లర్లు.. ఉద్యమ నేత సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్..
అతడు పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోతోనే అక్కడంతా హింస చెలరేగిందని అంటున్నారు.

Sonam Wangchuk Arrest: లద్దాఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్ అయ్యారు. ఆందోళనకారులను వాంగ్ చుక్ రెచ్చగొట్టారని కేంద్ర హోంశాఖ ఇప్పటికే తెలిపింది. లద్దాఖ్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారటానికి ప్రధాన కారణం వాంగ్ చుక్ అని తెలిపింది కేంద్ర హోంశాఖ. హింసాత్మక ఘటనల్లో నలుగురు మృతి చెందగా, సుమారు 70 నుంచి 80 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. దీనంతటికి వాంగ్ చుక్ కారణం అంటున్నారు. అతడు పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోతోనే అక్కడంతా హింస చెలరేగిందని అంటున్నారు. అందరూ రోడ్లపైకి వచ్చేసి అల్లర్లకు పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ తెలిపింది. సోనమ్ వాంగ్ చుక్ ఎన్జీఓ లైసెన్స్ ను కూడా రద్దు చేసింది కేంద్రం.
లేహ్ లద్దాఖ్ లో అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారి అంటూ వాంగ్ చుక్ కు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్ చుక్ ను లేహ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్జీవో పేరు మీద విదేశాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి వాటిని వివిధ కార్యక్రమాలకు దారి మళ్లించినట్లుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అల్లర్ల వెనుక వాంగ్ చుక్ ప్రత్యక్షంగా ఉన్నారని చెబుతున్నారు. తన ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం లద్దాఖ్ లో అల్లర్లు జరిగాయి. లద్దాఖ్ కు ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు. దీన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ హింసాత్మక ఘటనలకు వాంగ్ చుక్ కారణం అంటూ ఆయనని అరెస్ట్ చేసింది. యువతను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణం అయ్యారనే ఆరోపణలతో జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్ చుక్ ను అదుపులోకి తీసుకున్నారు. 2019లో లద్దాక్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినందుకు వాంగ్‌చుక్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని ఆయన పోరాటం చేస్తున్నారు.
లద్దాఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఇటీవల నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, హింస చెలరేగడంతో తన 15 రోజుల నిరాహార దీక్షను ఆయన విరమించుకున్నారు.