Spadex Mission : ఇస్రో స్పేడెక్స్ ప్రయోగం విజయవంతం..

గగన్ యాన్, చంద్రయాన్ 4 ప్రయోగాలకు స్పేడెక్స్ ఉపగ్రహాలు సహకారం అందించనున్నాయి.

Spadex Mission : ఇస్రో మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్ ఎల్వీ సీ-60 రాకెట్ రెండు ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్స్ 440 కిలోల బరువు ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే చేయగలిగిన స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ ను భారత్ పూర్తి చేసింది.

ముఖ్యంగా స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. 10 గంటల 15 సెకన్లకు పీఎస్ఎల్ఎల్వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా 9 గంటల 58 నిమిషాలకు పంపించాలని అనుకున్నప్పటికి.. 2 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం చేపట్టారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, రాకెట్ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చేయడంతో ఆలస్యంగా పంపించారు.

తొలిసారిగా డాకింగ్, అన్ డాకింగ్ చేసే విధంగా శాటిలైట్లను ఇస్రో రూపొందించింది. వీటికి ఛేజర్, టార్గెట్ గా నామకరణం చేశారు. 440 కిలోల బరువైన ఈ రెండు ఉపగ్రహాలు నింగిలో వివిధ సేవలు అందించనున్నాయి. అంతరిక్షంలో ఇతర శాటిలైట్లను అనుసంధానం చేయడం, అంతరిక్ష వ్యర్థాలను తొలగించడంతో పాటు అటు భవిష్యత్తులో సొంత అంతరిక్ష కేంద్రానికి సేవలు అందించేలా వీటిని రూపొందించారు. గగన్ యాన్, చంద్రయాన్ 4 ప్రయోగాలకు స్పేడెక్స్ ఉపగ్రహాలు సహకారం అందించనున్నాయి.

Also Read : భారత్ మీద మరో భారీ కుట్ర చేస్తున్న చైనా? బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్ట్ నిర్మాణం అందుకేనా..!