మధ్యప్రదేశ్ ఐటీ అధికారులు చేస్తున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి అక్కడ. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అభియోగాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితుల నివాసాలపై ఈ దాడులు జరిగాయి. ఏప్రిల్ 07వ తేదీ నుండి కొనసాగుతున్న తనిఖీలు ఏప్రిల్ 08వ తేదీ సోమవారం కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీతో సహా 50 ప్రాంతాలో సోదాలు చేస్తున్నారు. సీఎం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) ప్రవీణ్ కక్కర్, ఆర్కే మిగ్లానీ ఇళ్లలో కూడా సోదాలు చేశారు అధికారులు.
ఈ సోదాల్లో దాదాపు 200 మంది పైగా అధికారులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ సోదాల్లో పెద్ద మొత్తం నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో హవాలా మార్గంలో నగదు చేరవేస్తున్నారని, పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించినట్లు ఐటీ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ కుట్రలు పన్నుతోందని..సీఎం కమల్ నాథ్ మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ అధికారులతో దాడులు చేయిస్తూ…అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనే విమర్శలున్నాయి.